బాహుబలి సీరీస్ తరువాత హీరోగా ప్రభాస్ ఒక్కసారిగా సూపర్ స్టార్ డం ను అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల జాబితా కూడా భారీ బడ్జెట్ తో కూడుకున్నవి కావడం విశేషం. అయితే వరుసగా భారీ ప్రాజెక్ట్ లపై పని చేసిన ప్రభాస్.. కాస్త రిలీఫ్ కోసం మారుతితో ఒక రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ తీయాలనే ఆలోచనతో మారుతి తో సినిమాకు సై అన్నారు.
ఇక పైన ఉదహరించిన ప్రభాస్ భారీ సినిమాల్లో మొదటగా రాబోయే చిత్రం ఆదిపురుష్.. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుని గ్రాఫిక్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక సాలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్ లో ప్రభాస్ ఒకేసారి పాల్గొనబోతున్నారని సమాచారం.
ఈ సినిమాలు మాత్రమే కాకుండా అర్జున్ రెడ్డితో అందరి దృష్టినీ ఆకర్షించిన సందీప్ వంగాతో స్పిరిట్ అనే సినిమాను ప్రకటించారు. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమాను పూర్తి చేసిన తరువాత సందీప్ ప్రభాస్ తో సినిమా మొదలు పెట్టనున్నారు. వీటితో పాటు మారుతి కాంబినేషన్లో కూడా సినిమాను ప్రభాస్ సిద్ధం చేశారు.
కాగా మారుతితో చేయబోయే సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అయితే రాజా డీలక్స్ టైటిల్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాజా డీలక్స్ టైటిల్ వెనుక ఎలాంటి కథ ఉందోనని ప్రభాస్ అభిమానులు కొందరు అసక్తి తో ఉంటే.. మరి కొందరు మాత్రం అసలు భారీ ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ మధ్యలో మారుతితో సినిమా ఎందుకు అనే అభిప్రాయంలో ఉన్నారు. పైగా తాజాగా మారుతి దర్శకత్వంలో వచ్చిన పక్కా కమర్షియల్ సినిమా డిజాస్టర్ అవడంతో మరింత ఆందోళనలో ఉన్నారు ప్రభాస్ అభిమానులు.
మారుతి మాత్రం ఈ సినిమాని ఒక సువర్ణ అవకాశంగా భావిస్తున్నారు. ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. హర్రర్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఒక థియేటర్ కు కూడా ప్రత్యేక పాత్ర ఉంటుందట. ఆ థియేటర్ కు హీరో పాత్రకు ఆసక్తికరమైన సంబంధం ఉంటుందట.
ప్రభాస్ ఇమేజ్ కి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. ప్రభాస్ ను కొత్తగా చూస్తారని.. ప్రభాస్ అభిమానులకు నచ్చే విధంగా ప్రభాస్ ఈ సినిమా లో కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి.
కాగా రేపే ఈ సినిమాకి సంభందించిన పూజా కార్యక్రమాలు జరుపుకుని సినిమాను మొదలు పెడతారని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ఇటలీలో ఉన్నందున ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావటం లేదట. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మించబోతున్నారు.. ప్రభాస్ కు జోడీగా మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ నటించబోతున్నారని వార్తలు వచ్చినా.. ఆ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు.
అలాగే ఇటీవల కార్తీకేయ 2 వంటి భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న పీపుల్స్ మీడియా ఫాక్టర్ సంస్థ ఈ సినిమాకు రెండో నిర్మాణ సంస్థగా వ్యవహారించనున్నారట.