పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవల నాగ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు చేసారు. ఇక ఆ మూవీ సక్సెస్ జోష్ లో ఉన్న ప్రభాస్ త్వరలో సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక మరోవైపు మారుతీతో ది రాజా సాబ్ మూవీ షూట్ లో పాల్గొంటున్న ప్రభాస్ నేడు మరొక మూవీని గ్రాండ్ గా లాంచ్ చేసారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ మూవీకి సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహించనుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చనున్నారు.
ఈ మూవీ యొక్క అధికారిక పూజా కార్యక్రమం నేడు హైదరాబాద్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సహా మరికొందరు విచ్చేసి టీమ్ కి ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ యాక్షన్ మూవీకి ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.