రీ-రిలీజ్‌లు అనేవి ప్రస్తుతం టాలీవుడ్ హీరోల అభిమానులకు ఒక వరంగా మారాయి. వారు ఇప్పుడు ఇతర అభిమానులతో కలిసి థియేటర్‌లో పాతకాలపు క్లాసిక్‌లు మరియు కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌లను చూసే అవకాషం ఈ స్పెషల్ షోల వల్ల దొరుకుతుంది. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులు బిల్లా సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల ధియేటర్లలో స్పెషల్ షోస్ ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా పరిస్థితులు అదుపు తప్పాయి.
ఆంధ్ర ప్రదేశ్ లోని తాడేపల్లిగూడెంలోని వెంకటరమణ థియేటర్‌లో బిల్లా ప్రదర్శన జరుగుతున్న సమయంలో ప్రభాస్ అభిమానులు థియేటర్‌లో నిప్పంటించడంతో థియేటర్ యాజమాన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన ఇతర హీరోల అభిమానులు మాత్రమే కాకుండా ప్రభాస్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో తమ సహ అభిమానుల ఈ వికృత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఇప్పటికే పోకిరి, జల్సా, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలు తమ సెకండ్ ఇన్నింగ్స్‌లో వసూళ్ల పరంగా, స్పెషల్ షోల ద్వారా ప్రభావాన్ని చూపడంలో ఒక అద్భుతం సృష్టించాయి అనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడు సినిమాని కూడా మెగా అభిమానులు ఇటీవల రీ రిలీజ్ చేసినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరైన ప్రభావం చూపడంలో విఫలమైంది.
గత కొన్ని నెలలుగా, స్పెషల్ షోల సమయంలో అభిమానులు శృతి మించి చేసుకుంటున్న సంబరాలు.. వాటి వల్ల జరిగే విధ్వంసం థియేటర్ నిర్వహణకు పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి సంఘటనల వల్ల వారు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ నష్టాలు చాలా థియేటర్లకు లక్షల్లో వచ్చాయి. చాలా చోట్ల కుర్చీలు, స్క్రీన్‌లు కూడా పాడైపోవడంతో థియేటర్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
పోకిరి సినిమా రీ రిలీజ్ సమయంలో చాలా థియేటర్లలో ఎంట్రీ గేట్లు, అద్దాలు పగలగొట్టారు. ఆ తరువాత జల్సా స్పెషల్ షోల సమయంలో కూడా మళ్ళీ అలాంటి విధ్వంసాలు జరిగాయి. ఇప్పుడు బిల్లా రీ-రిలీజ్ విషయంలో కూడా అదే రిపీట్ అయింది.
ఇప్పుడు ఇక స్పెషల్ షోలు వేయడానికి థియేటర్ల యాజమాన్యాలు ఎంత మాత్రం సంతోషించడం లేదు. ఇలాంటి సంఘటనల వలన నిరంతర నష్టం వాటిల్లుతుండటంతో.. స్పెషల్ షోల పట్ల ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలని వారు యోచిస్తున్నారు.
ఇలా అభిమానుల వల్ల నష్టం జరిగే ట్రెండ్ ఎక్కువ కాలం కొనసాగితే, థియేటర్ యాజమాన్యం గట్టి చర్య తీసుకుని, రీ-రిలీజ్‌లను పూర్తిగా నిలిపివేసే నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపొనక్కర్లేదు.