బాహుబలి సీరీస్ తరువాత ప్యాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్.. “ప్రాజెక్ట్ కె” అనే భారీ బడ్జెట్ సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రేక్షకులు ఈ పాన్-ఇండియా సినిమా రిలీజ్ కొరకు ఎదురు చూస్తున్నారు. సినిమాని ప్రకటించిన రోజు నుంచే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి . మహానటి వంటి అద్భుతమైన క్లాసిక్ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బిగ్ బిఅమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రభాస్ తో తొలిసారి జోడీ కట్టబోతున్నారు. ఈ అంశాలు అన్నిటి వల్ల సినిమా పై భారీ క్రేజ్ వచ్చింది.
ప్రాజెక్ట్ కే కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రధానంగా ఒక సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఉంటుందట. అంతే కాక ఈ సినిమా భారీ ఎత్తున గ్రాఫిక్స్ ను కలిగి ఉంటుందని సమాచారం. ఇలాంటి సినిమాలు సాధారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం తీసుకుంటాయి. పైగా ఈ చిత్రం విడుదలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. 2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ఇటీవలే నిర్మాత అశ్వినీదత్ ప్రకటించారు.
అయితే, తాజాగా ఆయన చేసిన ఒక తాజా ప్రకటన, ప్రభాస్ అభిమానులను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.ప్రాజెక్ట్ కే సినిమా దాదాపు 55% చిత్రీకరణ పూర్తయిందని అగ్ర నిర్మాత అశ్వినీదత్ తెలిపారు. అదేంటి భారీ బడ్జెట్ మరియు ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్న సినిమా ఇంత తొందరగా సగం షూటింగ్ ను ఎలా పూర్తి చేసుకుంది? అసలు ఇది ఎలా సాధ్యం? అని ప్రభాస్ అభిమానులు అడుగుతున్నారు. అంతే కాకుండా ఇంత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం నిజమైతే సినిమాని చుట్టేశారు ఏమో అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.
వైజయంతీ మూవీస్ సంస్థ ఈ సైంటిఫిక్ థ్రిల్లర్‌ను దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న నాగ్ అశ్విన్ సినిమాని ప్రకటించినపుడే.. ఇది కేవలం ప్యాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు ప్యాన్ వరల్డ్ సినిమాగా పేర్కొన్నారు. మరి ఆయన ఆశించిన స్థాయిలో సినిమాని తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకుంటారా లేదా తెలియాలి అంటే 2024 వరకూ ఆగక తప్పదు.