ప్రభాస్ ఆదిపురుష్ టీజర్‌కి మిశ్రమ స్పందన వచ్చినప్పటి నుండి, సినిమాను ఎప్పుడు విడుదల చేయాలనే దాని పై ఆ చిత్ర నిర్మాతలు గందరగోళంలో ఉన్నారు. టీజర్ విడుదల కాకముందు ఆదిపురుష్ సినిమాకి పోటీగా తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఆదిపురుష్ సంక్రాంతికి విడుదలకు పోటీగా చాలా సినిమాలు వస్తున్నాయి.
నిజానికి ఆదిపురుష్ బృందం మొదట జనవరి 12న విడుదల తేదీని ప్రకటించారు. కానీ ఇప్పుడు చిరంజీవి యొక్క వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి నుండి పోటీ కారణంగా వారు ఈ తేదీన విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది.
అంతే కాకుండా తమిళంలో అజిత్ నటించిన తునివు, విజయ్ నటించిన వారిసు అనే రెండు చిత్రాలు కూడా సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్నాయి.
ఇప్పుడు ఆదిపురుష్ నిర్మాతలకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. వారు తమ సినిమాను ప్రీ-ఫెస్టివల్ రోజుల్లో అంటే జనవరి 6వ తేదీన విడుదల చేయవచ్చు లేదా సినిమాను ఫిబ్రవరి లేదా మార్చికి వాయిదా వేయవచ్చు. మొదటి ఆప్షన్ ను ఎంచుకుంటే వచ్చే సమస్య ఏమిటంటే, జనవరి 6 సినిమాలకు అసలు అనుకూలం కాని సమయం మరియు ప్రేక్షకులు ఎవరూ ఆ సమయంలో థియేటర్లలోకి అడుగు పెట్టడానికి ఆసక్తి చూపరు.
అయినా సరే సినిమాకి క్రేజ్ ఉంది కదా అని విడుదల చేస్తే.. సంక్రాంతి పండగ కంటే వారం ముందుగానే సినిమా విడుదలైతే సరిగ్గా పండగ సెలవులు వచ్చే సమయానికి తక్కువ థియేటర్లు లభించే ప్రమాదం ఉంది.
ఈ రెండు దారులలో ఏది సరైన నిర్ణయం అనే విషయంలో నిర్మాతలు తీవ్ర డైలమాలో పడ్డారు. అయితే సినిమాకి ఖర్చు పెట్టిన బడ్జెట్ మరియు ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాల్సిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆదిపురుష్ సినిమా విడుదలను వాయిదా వేయటమే సరైన నిర్ణయం అని అంతర్గత వర్గాల వారు అభిప్రాయ పడుతున్నారు.
ఆదిపురుష్‌లో ప్రభాస్ తో పాటు కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ మరియు దేవదత్తా నాగే కూడా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఓం రౌత్ ఈ చిత్రానికి రచయితతో పాటు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. టి-సిరీస్ ప్రొడక్షన్ పతాకం పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.