పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు చిత్రం ఆయన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మరియు అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవడం, స్క్రిప్ట్ లో మార్పులు వంటి అనేక అడ్డంకులకు గురవుతూ వస్తుంది.
అన్ని సమస్యలు తీరిపోయి తాజాగా ఈ సినిమా షూటింగ్ మళ్ళీ సజావుగా సాగుతుందని ఇటీవలే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మళ్లీ ఈ సినిమా షూటింగ్ విషయంలో మరో సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. హరి హర వీర మల్లు చిత్రానికి పవన్ కళ్యాణ్ కేవలం 40 రోజుల కాల్ షీట్లు మాత్రమే కేటాయించారని తెలుస్తోంది. కాగా తాను ఇచ్చిన ఈ నలభై రోజుల వ్యవధిలోనే తనకు సంభందించిన షెడ్యూల్ మొత్తం పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారట.
అయితే, ఒక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్న సినిమా పూర్తి కావడానికి అంత తక్కువ వ్యవధి సరిపోదని.. మరింత సమయం పడుతుందని భావించిన దర్శకుడు క్రిష్.. పవన్ కళ్యాణ్ పాత్ర తాలూకు షూటింగ్ కోసం దాదాపు 65 రోజులు కావాలని అభ్యర్థించారట. కానీ 65 రోజుల కాల్ షీట్లు ఇవ్వడం కుదరదని, కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ క్రిష్ కు స్ట్రిక్ట్ గా చెప్పారట.
అంతే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్ కు సంభందించిన క్లోజప్ షాట్స్ మరియు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను పూర్తి చేయడానికి క్రిష్ సన్నాహాలు చేస్తున్నారట. ఆ తర్వాత సినిమాలోని మిగతా పోర్షన్స్‌ని డూప్ ఆర్టిస్టుతో మేనేజ్ చేయనున్నారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ కేవలం హీరోగా ఒకేసారి రెండు మూడు చిత్రాలు ఒప్పుకోవడంతో పాటు జనసేన పార్టీ వ్యవహారాల్లో కూడా నిమగ్నమై ఉంటారు కాబట్టి ఆయన షెడ్యుల్ చాలా బిజీగా ఉంటుంది అని మనందరికీ తెలుసు. కానీ ఒక్కసారి సినిమా చేస్తానని కమిట్ అయిన తర్వాత సదరు సినిమా పట్ల చాలా నిజాయతీగా వ్యవహరించడం ముఖ్యం కదా. మరియు అది ఆయన భాధ్యత కూడా.
అలాంటిది కేవలం ఒక డూప్ ఆర్టిస్టుతో షూటింగ్ చేయిస్తే.. ఆ సినిమా అందించాల్సిన పూర్తి అనుభవం అందకుండా ప్రేక్షకుడు గందరగోళానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే అలా జరగకూడదని ఆశించడం మాత్రమే మనం చేయగలిగింది. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమా రూపొందించడంలో ఏవైనా పొరపాట్లు జరిగితే నిర్మాతలకు చాలా డబ్బు ఖర్చుతో పాటు అనవసరమైన ఆందోళన కూడా కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.