ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి మరోసారి కరోనా బారిన పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రి (ఏఐజీ)లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ నిమిత్తం పుణె వెళ్లిన ఆయన నిన్న (గురువారం) హైదరాబాద్నట్ తిరిగి వచ్చారు.
అయితే ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా కొవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. పోసానికి కోవిడ్-19 సోకడం ఇది మూడోసారి. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. నటుడిగా, రచయితగా, నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న పోసాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మూవీ టీవీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పైన పేర్కొన్న విధంగా ఇంతకు ముందు కూడా రెండు సార్లు పోసాని కోవిడ్-19 బారిన పడినప్పటికీ ఆ తర్వాత కోలుకున్నారు. ఈసారి కూడా ఆయన కోలుకొని త్వరగా సాధారణ స్థితికి వస్తారని ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఆశిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ మధ్య కాస్త శాంతించిన కరోనా వైరల్ మళ్లీ కలవర పెడుతుంది. దేశంలో రోజువారి కరోనా కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 45 కరోనా కేసులు నమోదు కాగా, ఒక్క హైదరాబాద్ లోనే 18 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం భయపడాల్సిన అవసరం ఏమీ లేకపోయినా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.