సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్ సినిమా విడుదలకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది తమిళ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అవడంతో పాటు ముందుగానే చెప్పుకున్నట్లు మన భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం వల్ల ఈ చిత్రానికి అసాధారణమైన హైప్ నెలకొంది. కాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి, తద్వారా రికార్డు ఓపెనింగ్స్ రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
ఈ చిత్రం ముఖ్యంగా తన సొంత గడ్డ అయిన తమిళనాడులో రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తమిళ నాట అత్యధిక ఓపెనింగ్స్ రికార్డు దాదాపు 75 కోట్ల గ్రాస్‌తో దళపతి విజయ్ బీస్ట్ సినిమాతో తన పేరిట ఉంచుకున్నారు. ఇది కేవలం తమిళ వెర్షన్‌కు వచ్చిన ఓపెనింగ్స్ కావడం విశేషం. ఇక ప్రేక్షకుల నుండి పాజిటివ్ మౌత్ టాక్‌తో పొన్నియిన్ సెల్వన్ ఈ రికార్డును బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్నాడు.
తమిళనాట ఈ చిత్రానికి క్రేజ్ మరియు ఉత్కంఠ అద్భుతంగా ఉండటం అందరూ ఊహించిన విషయమే, కానీ ఇతర భాషల్లోనూ పొన్నియిన్ సెల్వన్ పట్ల చక్కని ఆసక్తి నెలకొంది. అన్ని వెర్షన్లతో కలుపుకుని, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 95 కోట్లు, కబాలి 90 కోట్లు వసూలు చేసి టాప్ 2 ఓపెనర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, పొన్నియిన్ సెల్వన్ ఈ సంఖ్యలను దాటిపోవచ్చు అనే అంటున్నారు. అయితే ఆ మార్కును పొన్నియిన్ సెల్వన్ సినిమా చేరుకుంటుందా లేదా తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 30 వరకు ఆగాల్సిందే.
పొన్నియిన్ సెల్వన్ చిత్రం భారతీయ సినిమా పరిశ్రమలోని కొందరు ప్రముఖులతో కూడిన భారీ తారాగణంతో రూపొందింది. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తీ, చియాన్ విక్రమ్, జయం రవి ప్రధాన పాత్రలు పోషించారు. రవి వర్మన్ కెమెరా బాధ్యతను తీసుకోగా.. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు.