మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం తమిళనాడు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ చిత్రం ఈ దిగ్గజ దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రసిద్ధి చెందిన ఈ చిత్రానికి తమిళనాడులోని అన్ని ప్రాంతాల నుండి లభిస్తున్న అమితమైన ప్రేమ, ఆదరణను చూసి చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది.
కాగా పొన్నియిన్ సెల్వన్ చిత్రం తొలి వారాంతంలో రూ. 200 కోట్ల గ్రాస్ మార్కును తెచ్చుకుంది. అంతే కాకుండా చాలా తొందరగా ఎవరూ ఊహించని విధంగా మ్యాజికల్ ఫిగర్ అయిన 250 కోట్ల మార్కును కూడా దాటడం విశేషం. కాగా ఈ చిత్ర ప్రచార నిమిత్తం చిత్ర బృందం భారతదేశం అంతటా పర్యటించింది.
చోళ రాజవంశ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. పొన్నియిన్ సెల్వన్ కేవలం తమిళనాడు లోనే కాకుండా మిగిలిన ప్రాంతాలలో అద్భుతమైన ఓపెనింగ్స్ పొందింది. కాగా తమిళ వెర్షన్ ఏకంగా ఆల్-టైమ్ రికార్డ్‌ను నెలకొల్పింది.
అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా ప్రదర్శన అనుకున్నంత బాగా లేదు. తెలుగు రాష్ట్రాల్లో పొన్నియిన్ సెల్వన్ మొదటి వారాంతం బాగానే వసూళ్లు రాబట్టింది. కానీ సోమవారం అనూహ్యంగా కుప్పకూలింది. అప్పటి నుంచి ఏమాత్రం ఎదుగుదల లేకపోగా.. పండగ రోజు కూడా కలెక్షన్లు పెరగలేదు.
తెలుగు రాష్ట్రాల్లో పొన్నియిన్ సెల్వన్ సినిమా హక్కులను 10 కోట్లకు కొనుగోలు చేసారు. పబ్లిసిటీ ఖర్చులతో కలుపుకుంటేబ్రేక్ – ఈవెన్ కోసం ఈ చిత్రం 12 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం కలెక్షన్లు వస్తున్న ట్రెండ్‌ను చూస్తుంటే, ఈ చిత్రం మొత్తంగా 9 కోట్ల కంటే తక్కువే కలెక్ట్ చేసేలా ఉంది. నిజానికి చిన్న లాస్ అయినప్పటికీ.. భారీ సినిమాగా ప్రచారం అయిన ఈ సినిమాకి అంత తక్కువ కలెక్షన్లు రావడం విచారకరం.
అయితే ఈ చిత్రం తెలుగులో అనుకున్నంత స్థాయిలో ఆడకపోవడానికి కారణం లేకపోలేదు. చోళ రాజుల గురించి మన తెలుగు ప్రేక్షకులకి పెద్దగా తెలియదు. పైగా డబ్బింగ్ లో పాత్రల పేర్లు తమిళ వెర్షన్ లో ఉన్నట్టే ఉండటం కూడా ప్రేక్షకులను గందరగోళంలోకి నెట్టేశాయి అని కూడా చెప్పచ్చు.