సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో తెరకెక్కించిన పీరియాడిక్ యాక్షన్ ఫిలిం “పొన్నియిన్ సెల్వన్-1” రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 30న ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు. మణిరత్నం దాదాపు నాలుగేళ్ళ విరామం తర్వాత తిరిగి వస్తుండటంతో ఈ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది.
‘పొన్నియిన్ సెల్వన్’ అనేది మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న విషయం తెలిసిందే. ప్రసిద్ధ రచయిత కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా చోళుల కాలం నాటి కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఫ్రాంచైజీ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.. మొదటి భాగం ‘PS-1’ రిలీజైన తొమ్మిది నెలల్లో రెండవ భాగం విడుదల చేస్తామని ప్రకటించారు. తమిళ ప్రేక్షకులు మరియు సినీ మీడియా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో మణిరత్నం, మరియు చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను మమ్మురం చేశారు. ఇక పీఎస్-1 నిడివి 2 గంటల 50 నిమిషాలు వచ్చిన నేపథ్యంలో.. కొందరు సినీ విశ్లేషకులు ఇది సినిమాకి నెగటివ్ అవుతుందేమో అని అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇలాంటి పీరియాడిక్ చిత్రాలు ప్రేక్షకులను అలరించాలి అంటే ఈ మాత్రం నిడివి అవసరం అనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో ముఖ్య పాత్రలు చాలా ఉంటాయి. మరి ఆ పాత్రలను ప్రేక్షకులు ఇష్టపడాలి అనుకుంటే ఒక్కో పాత్రకి సమాన స్థాయిలో ప్రాధాన్యం ఉండాలి.
అయినా సినిమా బాగుంటే మూడు గంటలైనా ప్రేక్షకులు ఆదరిస్తారని మన తెలుగు సినిమాలైన రంగస్థలం, బాహుబలి-2, ఇటీవలే విడుదలై భారీ బ్లాక్ బస్టర్ అయిన తమిళ సినిమా విక్రమ్ నిరూపించాయి. అలాగే ఈ సినిమా కూడా పకడ్బందీ కథనంతో తెరకెక్కితే తప్పకుండా విజయం సాధిస్తుంది.
ఇక ఓవర్సీస్ లో పొన్నియిన్ సెల్వన్ రికార్డుల ఖాతాను తెరిచింది. ఈ సినిమా ప్రీ సేల్స్‌తో ఇప్పటికే 200K మార్క్‌ను దాటింది, USAలో ఈ ప్రీ సేల్స్ చూసి ఆశ్చర్య పోవటం ట్రేడ్ వంతయింది. విడుదలకు ఇంకా 10 రోజులు మిగిలి ఉన్న ఈ సినిమా ఇదే జోరు కొనసాగితే మిలియన్ డాలర్స్ ప్రీమియర్ షోలతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెన్ అవుతుందని అంచనా వేస్తున్నారు . USAలో మణిరత్నం బ్రాండ్ ఈసారి చాలా బాగా పని చేస్తోంది.
కాగా ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో విక్రమ్ – ఐశ్వర్యరాయ్ – త్రిష – కార్తీ – జయం రవి – శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రకాష్ రాజ్ – ప్రభు – విక్రమ్ ప్రభు – ఐశ్వర్య లక్ష్మీ – శరత్ కుమార్ – జయరామ్ – రెహమాన్ – రాధాకృష్ణన్ పార్థీవన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
లైకా ప్రొడక్షన్స్ మరియు మణిరత్నం మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సుభాస్కరన్ – మణిరత్నం సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.