దక్షిణ భారత సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకులలో ఒకరైన మణిరత్నం ఎన్నో ఏళ్లుగా కలగా భావించి తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఈ పండుగ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద విడుదలై విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓపెనింగ్ డే నుండే అద్భుతమైన కలెక్షన్లను నమోదు చేస్తూ ఎక్కడా ఆగకుండా రికార్డులు అన్నిటినీ కొల్లగొడుతూ దూసుకుపోతుంది.
పొన్నియిన్ సెల్వన్చి త్రం విడుదలైన మూడు వారాల లోపే బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా తమిళనాడులో కమల్ హాసన్ నటించగా.. ఇటీవలే ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విక్రమ్ సినిమా కలెక్షన్లను దాటేసి తమిళనాడులో అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా అవతరించింది.
తమిళనాడులో 2010లో విడుదలైన రోబో చిత్తం తొలి 100 కోట్ల గ్రాసర్‌గా నిలిచింది. ఇప్పుడు 200 కోట్ల బెంచ్‌మార్క్‌ను పొన్నియన్ సెల్వన్ సృష్టించడం విశేషం. నేటితో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 200 కోట్లు దాటడంతో ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. మొదటి నుండి తమిళ చిత్ర పరిశ్రమలో, ప్రేక్షకులలో ఈ సినిమా పట్ల భారీ హైప్ ఉండటంతో ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందని అనుకున్నారు కానీ బహుశా ఈ స్థాయి విజయం మాత్రం ఎవరూ ఊహించి ఉండరు.
పొన్నియన్ సెల్వన్‌తో మణిరత్నం నిజంగా చరిత్రలో నిలిచిపోయే బ్లాక్‌బస్టర్‌ని అందించారు. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 450 కోట్ల మార్క్‌ను దాటేసి 500 కోట్ల మైలురాయి వైపు పరుగులు పెడుతోంది.
పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం అరుల్మొళి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్) యొక్క జీవితంలోని ప్రారంభ దశ తాలూకు కథను చెబుతుంది, ఆయన తరువాత కాలంలో రాజ రాజ చోళ చక్రవర్తిగా (947-1014) ప్రసిద్ధి చెందారు తమిళ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తమ హృదయాలకు ఎంతో దగ్గరగా తీసుకున్నారు. ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇది మణిరత్నం కి మాత్రమే కాకుండా తమిళ ప్రజలకు కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు.
ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభితా ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటించారు. పొన్నియిన్ సెల్వన్-1 సినిమాతో దశాబ్దం తర్వాత ఐశ్వర్యరాయ్ తమిళ సినిమాలో మళ్ళీ కనిపించారు. కాగా ఐశ్వర్య రాయ్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయటం విశేషం – నందిని మరియు ఆమె మూగ తల్లి మందాకిని దేవిగా ఐశ్వర్య నటించారు.