పొన్నియిన్ సెల్వన్ చిత్రం గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ వస్తుంది. మరియు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలలో ఒకటిగా నిలిచింది. మణిరత్నం యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రసిద్ధి చెందిన ఈ చిత్రం తమిళనాడులో అద్భుతమైన విజయాన్ని సాధించింది మరియు ఓవర్సీస్ ఏరియాలతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా గొప్ప విజయాన్ని సాధించింది.
తమిళనాడులో దీపావళికి కొత్త సినిమాలను విడుదల చేసినప్పటికీ, ఆ ధాటికి తట్టుకుని కూడా ఈ చిత్రం పండుగ వారాంతం వల్ల లాభాన్ని పొందింది. ప్రస్తుతం తమిళనాడులో పొన్నియిన్ సెల్వన్ 215 కోట్లకు పైగా వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 160 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలకు పిచ్చి పట్టేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనకీర్తి పొందిన మణిరత్నం బ్రాండ్ దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
అన్నిట్లోకెల్లా.. తమిళనాడు మరియు ఓవర్సీస్ ప్రాంతాలు ఈ చిత్రానికి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ప్రాంతాలుగా నిలిచాయి. ఇక మిగిలిన ప్రాంతాల్లో ఈ సినిమా 110 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అయితే తెలుగు, హిందీ వెర్షన్లో పొన్నియిన్ సెల్వన్ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. కానీ మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 485 కోట్ల భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం 500 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది.
రెండు భాగాలుగా విభజించబడ్డ ఈ చిత్రానికి.. మొదటి భాగానికి కేటాయించిన బడ్జెట్ లోనే రెండవ భాగానికి సంభందించిన షూటింగ్ కూడా పూర్తి చేయడంతో పొన్నియన్ సెల్వన్ నిర్మాతలకు అత్యంత భారీ లాభదాయకమైన సినిమాగా మారింది. పార్ట్ 1 విశేష స్థాయిలో ప్రేక్షకులను అలరించడంతో పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెరగటం ఖాయమనే చెప్పాలి.
పొన్నియిన్ సెల్వన్‌లో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తీ, జయం రవి ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, రెహమాన్, ప్రబు, విక్రమ్ ప్రభు, కిషోర్, నాజర్ వంటి నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ అద్భుతమైన కెమెరా వర్క్ ను అందించగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన ఏఆర్ రెహమాన్ వినసొంపైన పాటలతో పాటు ఉద్వేగభరితమైన నేపథ్య సంగీతం అందించారు.