బాక్సాఫీస్ వద్ద పొన్నియిన్ సెల్వన్-1 ప్రభంజనం ఇప్పటిలో ఆగేలా లేదు. ఈ చిత్రం ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది. ఇక ట్రేడ్ వర్గాల ప్రకారం, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రెండవ వారం ముగిసే సమయానికి దాదాపు రూ.450 (ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు) కోట్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ చిత్రం దీపావళి వరకు బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉంది.
ఇక తమిళనాడు ఏరియా విషయానికి వస్తే ఇటీవల విక్రమ్ 190 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దసరా పండగ తర్వాత కూడా అద్భుతమైన వసూళ్లను నమోదు చేస్తున్న పొన్నియిన్ సెల్వన్-1 చిత్రం, విక్రమ్ సినిమా ఫైనల్ కలెక్షన్‌లను కూడా బ్రేక్ చేసి 200 కోట్ల మార్కు వైపు దూసుకుపోతుంది. మరికొన్ని రోజుల్లో విక్రమ్ ను క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. అదే గనక చేస్తే తమిళనాడులో 200 కోట్ల వసూళ్లు సాధించిన మొట్టమొదటి చిత్రం అవుతుంది.
ట్రేడ్ వర్గాల ప్రకారం, ఈ చిత్రం దీపావళి వరకు మంచి రన్ కొనసాగిస్తుందని అంటున్నారు. కొత్త సినిమాల విడుదల తర్వాత కూడా ఈ చిత్రం అధిక సంఖ్యల థియేటర్లలో రన్ అయ్యే అవకాశం ఉంది. పోన్నియిన్ సెల్వన్-1 ప్రస్తుతం తమిళనాడుతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఈ చిత్రం రూ. 500 కోట్లకు పైగా (ప్రపంచవ్యాప్త కలెక్షన్లు) రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
పెట్టుబడి వారీగా చూసుకుంటే ఈ చిత్రం నిర్మాతలక చాలా లాభదాయకమైన సినిమాగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఈ చిత్రం మొదటి భాగం కలెక్షన్ల తోటే రెండు భాగాల బడ్జెట్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టిందని అంటున్నారు.
దిగ్గజ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పేర్కొనబడిన ‘పొన్నియిన్ సెల్వన్-1’ అదే పేరుతో అమరర్ కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో సమిష్టి తారాగణం అయిన – ఐశ్వర్య రాయ్ బచ్చన్, విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, ఐశ్వర్య లక్ష్మి మరియు శోభితా ధూళిపాళ తదితరులు ఉన్నారు.PS-2 మొదటి భాగం విడుదల నుండి ఏడు నెలల గ్యాప్ లోపే 2023లో విడుదల కానుంది.
మొదటి భాగం యొక్క భారీ విజయంతో, సీక్వెల్ సినిమాలకు ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభిస్తున్న ట్రెండ్ ప్రకారం సీక్వెల్ కూడా ఖచ్చితంగా మరింత డబ్బును ఆర్జిస్తుంది అని అన్ని వర్గాల వారు కూడా ఆశిస్తున్నారు.