పవన్ కళ్యాణ్ తనయుడిగా అకీరా నందన్ అందరికి పరిచయమే. అకీరాకు స్వంతంగా ఒక సోషల్ మీడియా అకౌంట్ అంటూ లేకపోయినా అతని తల్లి రేణు దేశాయ్ తన గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగా తెలియజేస్తూనే ఉన్నారు. అయితే తమ అభిమాన హీరోకు మల్లె అకీరా కూడా హీరో అవుతారని భావిస్తున్న పవన్ అభిమానులను మరియు ఇతర సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ అకిరా సంగీత దర్శకుడి అవతారం ఎత్తారు.
అకీరా నందన్ పియానో వాయిస్తారని, సంగీతంలో పలు విభాగాలు నేర్చుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. రేణు దేశాయ్ అప్పుడప్పుడు తను పియానో ప్లే చేసే వీడియోల్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలానే ఇటీవల అకీరా పుట్టిన రోజు నాడు కూడా పియానో వాయిస్తున్న ఓ వీడియోని షేర్ చేసి అకీరా సంగీతం వినిపిస్తుంటే బాగుంటుంది అని తెలిపారు. గతంలో అకీరా తన స్కూల్ ఈవెంట్ లో RRR సినిమాలోని దోస్తీ పాటకు పియానో వాయించగా ఆ వీడియో వైరల్ అయింది. తాజాగా అకీరా నందన్ సంగీత దర్శకత్వం వహించిన ఓ షార్ట్ ఫిలిం విడుదలయింది.
ఒక రచయితకు సంబంధించిన కథాంశంతో కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వంలో రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిలిం తెరకెక్కింది. ఈ సినిమాలో మనోజ్ అనే యువకుడు నటించారు. ఈ షార్ట్ ఫిలింకు అకీరా నందన్ సంగీతం అందించారు. నాలుగున్నర నిముషాలు ఉన్న ఈ షార్ట్ ఫిలింకు అకీరా అందించిన మ్యూజిక్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ షార్ట్ ఫిలింను షేర్ చేస్తూ ప్రముఖ నటుడు అడివి శేష్ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.
పవన్ కళ్యాణ్ తనయుడు సంగీత దర్శకుడిగా మారారనే వార్త అభిమానులను కాస్త షాక్ కు గురి చేసింది అనే చెప్పాలి. ఇన్నాళ్లూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా తెరంగేట్రం చేస్తాడని అనుకున్నారు కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ అకీరా ఇప్పుడు సంగీత దర్శకుడిగా మారారు. అయితే అకీరా కేవలం మ్యూజిక్ మాత్రమే చేస్తారు కానీ యాక్టింగ్ చేయరు అని ఏమీ నిర్ధారణ కాలేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కెరియర్ మొదలు పెట్టడానికి ఆయనకు ఇంకా చాలా సమయం ఉంది.