పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యువ దర్శకుడు సుజీత్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు నిర్మాతలు. ఇప్పుడు తాజాగా అంతర్గత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఓజీని ఈ ఏడాదే రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. పవన్ చేతిలో హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, క్రిష్ ‘హరి హర వీరమల్లు’ సినిమాలు కూడా ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇటీవలే పవన్ మొదలు పెట్టారు. అయితే ప్రస్తుతం హరి హర వీర మల్లు గురించి ఎలాంటి సమాచారం లేదు.
ఇదిలా ఉంటే ఈ ఏడాదే ఓజీ సినిమా విడుదల అవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ నిర్మాతలు మాత్రం పక్కా ప్లాన్ తో ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ నుండి పెద్ద సంఖ్యలో కాల్ షీట్స్ అవసరం లేదని, పవన్ కళ్యాణ్ తాలూకు కేవలం 30-35 రోజుల కాల్ షీట్స్ మాత్రమే అవసరమని, మరి కొద్ది రోజుల్లోనే ఆయన సినిమా సెట్స్ లో జాయిన్ అవుతారని, కంటిన్యూ షెడ్యూల్స్ నిర్వహించి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో సహా 6 నెలల్లో సినిమాను పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలనే యోచనలో చిత్ర యూనిట్ ఉందని అంటున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వర్ధమాన దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమిది. గతంలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఈ సినిమాను అనౌన్స్ చేయగా, సుజీత్ రచనతో పాటు దర్శకత్వం వహిస్తారని నిర్మాతలు ప్రకటించారు.
టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాఫియా డాన్ / గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారని అంటున్నారు. కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ ల విక్రమ్ తరహాలో ఈ సినిమా స్టోరీ స్టైల్ ఉంటుందని, ఇందులో హీరోకు స్క్రీన్ టైమ్ తక్కువే అయినా తెర పై జరిగే సంఘటనలన్నీ ఆయన చుట్టూనే ఉంటాయని అంటున్నారు. ఇక నిర్మాతల ప్లాన్ ప్రకారమే ఈ సినిమా షూటింగ్ జరిగి, ఈ ఏడాదే విడుదలవుతుందని ఆశిద్దాం.