పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా పై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని చిత్ర బృందం చాలా గట్టి నమ్మకంతో ఇదివరకే చాలా సార్లు చెప్పటం జరిగింది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన పోస్టర్స్ మరియు తొలుత వచ్చిన టీజర్ తో సినిమా పై అంచనాలను భారీగా పెరిగాయి.
సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందా.. ఎప్పుడు విడుదల అవుతుందా అన్న ప్రశ్నలతో ఎదురు చూస్తున్న ప్రేక్షకులు మరియు అభిమానులకి ఎట్టకేలకు ఆనందం కలిగించే విధంగా పవన్ కళ్యాణ్ తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ లో భాగం అవ్వబోతున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి వరకు సినిమా షూటింగ్ ను తొందరగా ముగించి.. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి.
ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ చిత్రానికి హైప్ ఇటీవలే ఊపందుకుంది. పవన్ కళ్యాణ్ ఒక భారీ యాక్షన్ సన్నివేశంలో కనిపించే చిన్న గ్లింప్స్ తో ఇటీవల విడుదలైన టీజర్ తో అభిమానుల నిరీక్షణకు తెర పడినట్లే అనిపించింది. ఇక దర్శకుడు క్రిష్ మరియు చిత్ర బృందం ఇక్కడ నుండి సినిమాను భారీ స్థాయిలో ముందుకు తీసుకు వెళ్లగలమని ఎంతో నమ్మకంగా ఉన్నారు.
కాగా హరి హర వీరమల్లు చిత్ర బృందానికి ఇప్పటికే ట్రేడ్ సర్కిల్స్ నుండి మంచి ఆఫర్లను అందుకుంటున్నారు. అందుకే ఎలాంటి ఆలస్యం లేకుండా షూటింగ్‌ని పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. కాగా జనసేన పార్టీ పనులలో తొందరగా భాగం అవ్వాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు.
అక్టోబర్ 17న షూటింగ్ ప్రారంభం కానుందని, క్రిష్ ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసి అందులో చాలా వరకు చిత్రీకరణను పూర్తి చేస్తున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ పై చాలా అంచనాలు ఉండటంతో పవన్ మరియు క్రిష్ తమ ఉత్తమ పనితనం చూపించాలని తీవ్రంగా దృష్టి పెట్టారు. అంతే కాక ఫలానా తేది లోపు షూటింగును పూర్తి చేయాలనే తొందరపాటుతో పని చేయకూడదని దర్శకుడు క్రిష్ భావిస్తున్నారు.
మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. హరి హర వీర మల్లు సినిమా ప్యాన్-ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు హిందీలో కూడా విడుదల కానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిధి అగర్వాల్ కనిపించనున్నారు.