పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు ఆయన కెరీర్ లోనే అత్యంత ఆలస్యమైన సినిమాగా తయారవుతుంది. కరోనా మహమ్మారి తర్వాత హరి హర వీరమల్లు షూటింగ్ తిరిగి ప్రారంభమైనా అది నత్తనడకన సాగింది. ఈ సినిమాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని పలు ఊహాగానాలు కూడా వినిపించాయి.
పవన్ కళ్యాణ్ కూడా తన పొలిటికల్ మీటింగులతో బిజీ అయిపోవడంతో హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ వరుసగా ఆలస్యమవుతుండటంతో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్లు సమాచారం అందుతోంది.
కాగా హరి హర వీర మల్లు సినిమాని 2023 సమ్మర్లో విడుదల చేస్తామని కొద్ది రోజుల క్రితం చిత్ర నిర్మాతలు ధృవీకరించారు. అయితే తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 18న ఈ సినిమాని విడుదల చేయాలని నిర్మాతలు చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా పై పూర్తిగా దృష్టి సారించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటనలు, ప్రచారాల కారణంగా ఆయన షెడ్యూల్ కు అంతరాయం కలగడం అనేది పరిపాటిగా మారడం వల్ల అది అంత సులువు కాదనే చెప్పాలి.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న హరి హర వీరమల్లు చిత్రం మొఘలుల నుంచి కోహినూర్ లాంటి వజ్రాన్ని దొంగిలించే పనిలో ఉన్న రాబిన్ హుడ్ కథగా తెరకెక్కుతోంది. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్, ఆదిత్య మీనన్, పూజిత పొన్నాడ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.