తేరి రీమేక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తాజా వార్త మరియు ట్రెండింగ్ టాపిక్. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయబోతున్నారు అనే వార్త తాజాగా ప్రబలడంతో ఈ వార్త విన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమాత్రం సంతోషంగా లేరు.
గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా రావాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో “భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమా చాలా కాలం క్రితమే అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.
అయితే పవన్- హరీష్ ల రెండో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వరకే పరిమితమైంది. నెలలు గడిచినా కానీ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. వివిధ కారణాల వల్ల ఈ చిత్రం ఆలస్యమైంది. పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా, రాజకీయాల పై దృష్టి పెట్టడంతో ఈ సినిమా స్టార్ట్ చేయడం కష్టమని వార్తలు వచ్చాయి.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఒకే ఒక సినిమా చేసే అవకాశం ఉంది. దర్శకుడు హరీష్ శంకర్ మరో హీరో కోసం ప్రయత్నిస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే తాజాగా తమిళ చిత్రం తెరి రీమేక్ కోసం పవన్, హరీష్ కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నట్లు మరో వార్త వచ్చింది.
ఇప్పటికే తెలుగులో డబ్బింగ్ అయిన ఈ సినిమా థియేటర్స్ లో కూడా రిలీజ్ అవ్వడంతో పాటు ఓటీటీలో కూడా తెలుగులో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇది గుర్తుంచుకునే పవన్ కళ్యాణ్ అభిమానులు తేరి రీమేక్ వార్త విని నిరాశ చెందారు.
ఇది పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనే కాక సాధారణ ప్రేక్షకులలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా పై ఉండే ఆసక్తిని దెబ్బతీస్తుందని, చిరంజీవికి గాడ్ ఫాదర్ రీమేక్ బాగా బ్యాడ్ చేసినట్లే పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ పై కూడా ఈ రీమేక్ ప్రభావం చూపుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.
అంతే కాకుండా ట్విట్టర్ లో దర్శకుడు హరీష్ శంకర్ ను ట్యాగ్ చేస్తూ మాకు తేరి రీమేక్ వద్దు అంటూ ట్రెండ్ లు చేశారు. కొంతమంది కాస్త అతికి పోయి సూసైడ్ నోట్ లు కూడా వ్రాశారు. మరి అభిమానుల నుంచి ఇంత తీవ్రమైన స్పందన చూసి పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమాని అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.