ఫ్యాన్ వార్స్ అనేవి మామూలు విషయంగా.. ఎన్నో దశాబ్దాలుగా తెలుగు సినిమా ప్రయాణంలో భాగమైపోయింది. ఇంతకుముందు ఇది చాలా ఆరోగ్యకరమైన పద్ధతిలో ఉండేది, కానీ ఇప్పుడు అభిమానులు ఇతర హీరోల అభిమానులను దూషించడం మరియు వారితో గొడవలకు దిగే విధంగా రోజులు మారాయి.
తాజాగా ఒక అనుకోని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అభిమానిని ఓ ప్రభాస్ అభిమాని చిన్నపాటి విభేదాలతో హత్య చేయడం ఈ ఫ్యాన్ వార్లను తీవ్రస్థాయికి చేరింది.ఏలూరుకు చెందిన కిశోర్, హరికుమార్ అనే ఇద్దరు కార్మికులు ఇంటి పెయింటింగ్ పని మీద అత్తిలి వెళ్లారు. పని ముగించుకుని రాత్రంతా అక్కడే ఉండిపోవడంతో తమ అభిమాన తారల గురించి వారి మధ్య వాగ్వాదం మొదలైంది. కిశోర్ పవన్ కళ్యాణ్ గురించి వాట్సప్ స్టేటస్ పెట్టుకోవడంతో, దాని స్థానంలో ప్రభాస్ కు సంబంధించిన అప్ డేట్ పెట్టుకోవాలని హరికుమార్ పట్టుబట్టడంతో అది గొడవగా మారింది.
కిశోర్ నిరాకరించడంతో ఆవేశాన్ని ఆపుకోలేని హరికుమార్.. కిశోర్ తల పై, ముఖం పై గొట్టంతో కొట్టాడు. కిశోర్ తీవ్రంగా గాయపడి మరణించగా హరికుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. 2016లో ఇదే తరహాలో ఓ ఎన్టీఆర్ అభిమాని పవన్ కళ్యాణ్ అభిమానిని కత్తితో పొడిచి చంపాడు.
ఈ ఘటన పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు హరికుమార్ కోసం గాలిస్తున్నారు. అభిమాన తారల గురించి అభిమానుల నుండి ఇలాంటి వికృత యుద్ధాలు అనవసరమనే చెప్పాలి. వారు శారీరక దాడులకు దిగడం అనేది నిజానికి దారుణమైన సంఘటన అనే చెప్పాలి. ఇలాంటి ఘోర ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని ఆశిద్దాం.