మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ కోసం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఐతే ఈ సినిమాకి సంభందించి ఇప్పటి వరకు చాలామందికి తెలియని ఓ ఆసక్తికరమైన వార్తను పంచుకున్నారు నిర్మాత దిల్ రాజు.
తెలుగు చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇటీవలే మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఆ ఇంటర్వ్యూలలో భాగంగానే శంకర్ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మొదటగా హీరోగా అనుకున్నట్లు చెప్పారు.
గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్‌ని మొదట విన్నప్పుడు, శంకర్‌ని అడిగాను, మీ మనసులో ఎవరెవరు ఉన్నారని, ఆయన పవన్ కళ్యాణ్ లాంటి హీరో అని అన్నారు. అప్పుడు నేను రామ్ చరణ్‌ని తో చేయండి అని చెప్పాను, అలా జరిగింది. ఇది 90ల నాటి శంకర్ క్లాసిక్ సినిమాలా ఉంటుంది అని దిల్ రాజు అన్నారు. కాగా తాను స్క్రిప్ట్ వింటున్న సమయంలో, రామ్ చరణ్ RRR షూటింగ్‌లో ఉన్నారని.. మరియు శంకర్ కథ వినమని చరణ్ కు తాను చెప్పానని ఆయన తెలిపారు.
శంకర్ లాంటి దర్శకుడు తమ అభిమాన హీరోతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారన్న వార్త విని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషించారు. అయితే అదే సమయంలో వీరిద్దరి మధ్య అనుకున్న సినిమా రాకపోవడంతో దిల్ రాజు చేసిన ఈ ప్రకటన వారిని ఒక రకంగా బాధ పెట్టిందని కూడా చెప్పాలి.
ఈ చిత్రం శంకర్ యొక్క ఒకే ఒక్కడులో లాగా ఒక్కరోజు ముఖ్యమంత్రి వంటి కాన్సెప్ట్ ఏమైనా ఉంటుందా అని అడిగినప్పుడు, దిల్ రాజు సమాధానమిస్తూ, తాను ఇప్పుడు ఏ వివరాలను కూడా వెల్లడించలేనని, అయితే రామ్ చరణ్ నటించిన శంకర్ సినిమా ఒక క్లాసిక్ లా ఉంటుందని మాత్రం హామీ ఇచ్చారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ ను తన కూతురు హన్సితారెడ్డి, మేనల్లుడు హర్షిత్ రెడ్డి నిర్వహిస్తారని కూడా దిల్ రాజు చెప్పారు. ఇప్పుడు రెండు విభిన్న బ్యానర్లలో వీరు సినిమాలు చేయనున్నారు.