తన రాజకీయ పార్టీ జనసేన 10వ వార్షికోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ లో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ తన పారితోషికం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నా రాబోయే సినిమాకు రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటున్నానని పవన్ చెప్పుకొచ్చారు. అభిమానులకు తన మీద ఉన్న ప్రేమతోనే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. అయితే ప్రతి సినిమాకు ఇంత భారీ రెమ్యునరేషన్ వస్తుందన్న గ్యారంటీ ఇవ్వలేనని కూడా ఆయన అన్నారు.
వినోదయ సీతం రీమేక్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం తాను 22 రోజులు పని చేస్తున్నానని, ప్రతి రోజు తనకు 2 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు ఆయనే స్వయంగా బహిరంగంగా ధృవీకరించారు. మొత్తం మీద ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ దాదాపు 45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఈ సినిమాలో పవన్ షూటింగ్ పార్ట్ ను ఏప్రిల్ లోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు అని తెలుస్తోంది.
కాగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లతో పాటు కేతిక శర్మ, బ్రహ్మానందం, రోహిణి, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేను హ్యాండిల్ చేస్తారని, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఒరిజినల్ వెర్షన్ నుంచి పలు మార్పులు చేర్పులు జరిగేలా చూసుకుంటారని సమాచారం. పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ ల తోలి కలయికగా రానున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రంలో 2015లో వచ్చిన గోపాల గోపాల సినిమా తర్వాత పవర్ స్టార్ రెండోసారి ‘దేవుడు’ పాత్రలో నటిస్తున్నారు.