పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఆయన తొలి పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులతో సహా అందరూ ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందని భావించారు.
అయితే తాజాగా HHVM గురించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఓ పాట పాడబోతున్నారని అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారని, త్వరలోనే రికార్డింగ్ పూర్తవుతుందని తాజా సమాచారం.
ఇది వరకే తమ్ముడు, గుడుంబా శంకర్, జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, పంజా వంటి పలు చిత్రాల్లో పవన్ కళ్యాణ్ పాటలు పాడారు. ఒక పవన్ కళ్యాణ్ పాట పాడుతున్నారనే వార్త కంటే హరి హర వీరమల్లు సినిమా ఆగిపోలేదని, నిజంగానే విడుదలకు సిద్ధంగా ఉందని తెలిసి ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెగా సూర్య ప్రొడక్షన్ పతాకం పై ఎ.ఎం.రత్నం భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ సినిమా విడుదల తేదీతో పాటు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని త్వరలోనే చిత్ర బృందం వెల్లడించనుంది.