పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో పలు సినిమాలను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తమిళంలో తెరకెక్కి నేరుగా జీ5లో స్ట్రీమింగ్ అయిన ‘వినోదాయ సీతం’ను ఈ స్టార్ హీరో రీమేక్ చేయనున్నారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆయన ఒక కీలక పాత్ర కూడా పోషించారు.
ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో పవన్ మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కనిపించనున్నారు. దీంతో ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘వినోదాయ సీతం’ చిత్రం జూలై మొదటి వారం నుంచి ప్రారంభం కానుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ప్రారంభాన్ని వాయిదా వేశారు.
వినోదాయ సీతంతో పాటు పవర్ స్టార్ మరికొన్ని ప్రాజెక్టులను అనౌన్స్ చేయడంతో ఆయన ఈ సినిమా చేయరని అందరూ భావించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ మల్టీస్టారర్ మూవీ పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి 14న జరగనున్నాయి. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుందని తెలుస్తోంది.
ఈ నెలలోనే పవన్ కళ్యాణ్ ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అవుతారని, అలాగే సుజీత్ సినిమా కోసం కూడా ఒకేసారి వర్క్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. కాబట్టి మరో రెండు నెలలు ఈ రెండు సినిమాలతో బిజీ అయిపోయి రెండు సినిమాల షూటింగ్ పూర్తయిన తర్వాత వారాహి యాత్రను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో విజయవాడలో ‘వారాహి’ అనే వాహనం పై ఎన్నికల ప్రచారాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మిలిటరీ స్టైల్లో తయారైన ఈ వాహనంలో వివిధ హై సెక్యూరిటీ ప్రమాణాలు కూడా ఉన్నాయి. ఈ వాహనానికి ‘వారాహి దేవి’ ఆధారంగా పేరు పెట్టారు.