పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి పేర్లను తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తెలుగు పరిశ్రమలో ఎంతో ఉన్నతమైన ప్రయాణాన్ని కలిగి ఉన్నారు. మరియు ఆయన అంటే కేవలం తెలుగు సినిమా పరిశ్రమలోని వారికే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడా ఒక ప్రేరణగా, ఆదర్శంగా నిలిచారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. అనతికాలంలోనే వరుస బ్లాక్‌బస్టర్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా యూత్ ఐకాన్‌గా మారారు. ఈ సోదరులిద్దరూ బాక్సాఫీస్ వద్ద చాలా శక్తివంతమైన హీరోలు మరియు అపారమైన అభిమానుల సంఖ్యను కూడా కలిగి ఉన్నారు.
అయితే, ఇటీవల వారి సినిమాల ఎంపికలను చూసిన అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు చాలా నిరాశకు గురవుతున్నారు. అన్నదమ్ములిద్దరూ తప్పుడు ఎంపికలు చేసుకుంటూ ప్రస్తుత ట్రెండ్‌ని, ప్రేక్షకుల అభిరుచిని పట్టుకోలేకపోతున్నారనే చెప్పాలి.
పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబోలో ఒక సినిమా చాలా కాలం క్రితమే కన్ఫర్మ్ అయ్యింది, ఈ సినిమా టైటిల్ మరియు పోస్టర్ కూడా విడుదలై అభిమానులను ఆనందపరిచింది. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎంపికలు మరియు ఆయన షెడ్యూల్‌లో చాలా మార్పుల కారణంగా ఈ చిత్రం సెట్స్ పైకి రాలేదు.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, స్ట్రెయిట్ సినిమా కాకుండా తమిళ సినిమా తేరి రీమేక్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తేరి చిత్రం ఇప్పటికే తెలుగులోకి డబ్ చేయబడి విడుదలైంది మరియు ప్రేక్షకులకి OTTలో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది.
కోవిడ్ తర్వాత ప్రేక్షకులు రీమేక్‌లను తిరస్కరిస్తున్నారు మరియు రీమేక్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా ఆడటం లేదు. కాబట్టి తేరి రీమేక్ చేయడం చాలా ప్రమాదకర నిర్ణయంగా చెప్పవచ్చు. మనకు తెలియని సినిమాని రీమేక్‌గా తీస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఇప్పటికే తెలుగులో వచ్చిన సినిమాని రీమేక్ చేయడం చాలా రిస్క్.
తాజాగా చిరంజీవి గాడ్ ఫాదర్ విషయంలో కూడా అదే జరిగింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. చాలా మంది ప్రేక్షకులు ఇప్పటికే OTTలో లూసిఫర్‌ని వీక్షించారు. ఆ విషయమే గాడ్‌ఫాదర్‌ను దెబ్బతీసింది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే తప్పు రిపీట్ చేయబోతున్నారు. వార్తలు వస్తున్నట్లు ఆయన నిజంగా తేరి రీమేక్ చేస్తే మటుకు ఆ సినిమా పరాజయం పాలవడం దాదాపు ఖరారు చేసుకోవచ్చు.