హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ “తేరి” రీమేక్ చేస్తున్నారన్న వార్త నిన్నటి నుంచీ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వద్దే వద్దు అని పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్ ట్రెండ్ చేశారు పైగా ఇప్పటికీ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు.
అయితే దర్శకుడు హరీష్ శంకర్ ట్రాక్ రికార్డ్ ను దృష్టిలో ఉంచుకుని ఆయన రాసుకున్న ఒరిజినల్ స్క్రిప్ట్ కంటే రీమేక్ సినిమా చేస్తే బావుంటుందని కొందరు అభిమానులు, ఇతర తటస్థ ప్రేక్షకులు అంటున్నారు.
దర్శకుడు హరీష్ శంకర్ చివరి చిత్రం గద్దలకొండ గణేష్, ఇది తమిళ చిత్రం జిగర్తాండకు అధికారిక రీమేక్. గద్దలకొండ గణేష్ సినిమా 2019లో విడుదలై మూడేళ్లు కావస్తున్నా.. హరీష్ శంకర్ తన స్వంత స్క్రిప్ట్ తో సినిమా తీయడంలో విఫలం అయ్యారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా రావాల్సి ఉంది. అయితే సినిమాని ప్రకటించి ఎన్నో రోజులు కావస్తున్నా ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు.
దీనికి కారణం హరీష్ శంకర్ కొత్త కథతో పవన్ కళ్యాణ్ ను ఆకట్టుకోవడంలో విఫలం కావడమే. ఫైనల్ స్క్రిప్ట్ కూడా పూర్తి చేయకుండానే బిబిఎస్ సినిమాను అనౌన్స్ చేశారు. తాజాగా తెరి రీమేక్ వార్తలతో పవన్ కళ్యాణ్ అభిమానులు హరీష్ శంకర్ పై మండిపడుతున్నారు.
యువ దర్శకుడు సుజీత్ తాజా కథతో పవన్ కళ్యాణ్ ను ఇంప్రెస్ చేశారని, హరీష్ శంకర్ అలా చేయలేకపోయారని వారు ఆరోపిస్తున్నారు. తమ హీరో కొత్త సినిమా స్టార్ట్ అవ్వాలని అభిమానులు కోరుకోకపోవడం, అంతే కాకుండా ఆ సినిమా మొదలు అవ్వకూడదని ట్రెండింగ్ చేయడం విచిత్రంగానే కనిపిస్తుంది. ఇది ఎక్కడ ఎప్పుడు ఆగుతుందో తెలియడం లేదు.