పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో.. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హరి హర వీరమల్లు. అంతే కాకుండా ఈ చిత్రం పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియా సినిమా కావడం మరో విశేషం. ఈ చిత్రాన్ని నిర్మాత ఏ.ఎం.రత్నం మరియు ఏ. దయాకర్ రావు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందించబడిన ఈ చిత్రం 17వ శతాబ్దం నేపథ్యంలో, మొఘల్ సామ్రాజ్య కాలం నాటి కథగా తెరకెక్కుతుంది.
కాగా ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక బందిపోటు దొంగ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. భారీ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ సినిమా అన్ని విధాలుగా సరిగ్గా వచ్చేలా చిత్ర బృందం చాలా శ్రద్ధ వహిస్తూ పని చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా పై పలు రకాల పుకార్లు షికార్లు చేశాయి. సినిమా ఉంటుందో లేదో తెలీదని, దర్శకుడికి పవన్ కి మధ్య విభేదాలు వచ్చాయని ఏవేవో వార్తలు వినిపించాయి.
అయితే తాజాగా చిత్ర బృందం శుక్రవారం తదుపరి షెడ్యూల్ కి సంబంధించిన ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్ కు సంబంధించిన వీడియోని విడుదల చేసి సినిమా పట్ల ఉన్న అనుమానాలు అన్నిటినీ పటా పంచలు చేసింది. తదుపరి షెడ్యూల్ లో పాల్గొనే ప్రధాన నటీనటులతో పాటు మరి కొంత మంది సాంకేతిక నిపుణులతో ఈ ప్రి షెడ్యూల్ వర్క్ షాప్ ని నిర్వహించినట్లు తెలుస్తోంది.
కాగా ఈ వర్క్ షాప్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లుక్ అభిమానులకు ఎంతగానో నచ్చింది. ఈ లుక్ చూసి వారు ఒక్కసారిగా ఖుషి సినిమా రోజుల దగ్గరకి వెళ్ళిపోయారు అంటే అది అతిశయోక్తి కాదు. అసలు ఇంత యంగ్ గా పవన్ ఈ సినిమా కోసం మారిపోవడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఇక ఈ వర్క్ షాప్ లో పవన్ దర్శకుడు క్రిష్ లతో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొనడం విశేషం. ఈ ప్రీ వర్క్ షాప్ లో పవన్ కల్యాణ్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్, సునీల్, సుబ్బరాజు, రఘు బాబు మరియు హైపర్ ఆది పాల్గొన్నారు. ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాతలు ఏ.ఎం. రత్నం, ఏ. దయాకర్ రావు, సినిమాటోగ్రాఫర్ వి.ఎస్. జ్ఞానశేఖర్, విజయ్ అడారియా తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్ రెండవ వారం నుంచి ఈ చిత్రం కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం.