గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడు నరేష్, కన్నడ నుంచి వచ్చిన సీనియర్ నటి పవిత్రా లోకేష్ మధ్య ఉన్న సంబంధం గురించి పలు పుకార్లు షికార్లు చేసి వివాదాస్పదమయిన విషయం విదితమే. ముందుగా ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రావడంతో నరేష్ మూడో భార్య రమ్య మీడియా ముందుకు వచ్చి.. తన భర్త తనకు విడాకులు ఇవ్వకుండా నాలుగో పెళ్లి ఎలా చేసుకుంటాడంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం దుమారం రేపింది.
ఇక మరో పక్క తన భార్య మంచిది కాదని, అందుకే ఆమెను వదిలేసినట్లు నరేష్ మీడియా ముఖంగా తెగేసి చెప్పుకొచ్చారు. పరస్పర వాదనలు, ఆరోపణలతో ఆగకుండా.. బెంగళూరు లో ఒక హోటల్ లో నరేష్, పవిత్ర లని నరేష్. భార్య రమ్య కొట్టాలని చూడటం, పెద్ద గొడవ చేయటంతో ఈ విషయం ఎంతకీ తెగని వ్యవహారంలా తయారు అయింది.
ఇక ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం లోకి పవిత్రా లోకేష్ మాజీ భర్త సూచేంద్ర ప్రసాద్ దూసుకువచ్చారు. పవిత్రకు అక్రమ సంబంధాలు కొత్తేమీ కాదు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. నరేష్, పవిత్రా మాత్రం తాము స్నేహతులమని, ఒకరికొకరు తోడుగా ఉంటున్నామని చెప్పుకొచ్చారు. ఇక పవిత్రా విడాకుల విషయం గురించి మాట్లాడుతూ.. సూచేంద్ర తో తనకు పెళ్లే కాలేదని చెప్పుకురావడం గమనార్హం.
ఈ క్రమంలోనే సూచేంద్ర శనివారం విలేకర్ల సమావేశంలో పవిత్ర పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ” పవిత్రకు నాకు పెళ్లి అయ్యింది.. మేము ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. కానీ మా మ్యారేజ్ సర్టిఫికెట్ మాత్రం లేదు. కావాలనే మేము ఆ సర్టిఫికెట్ ను తీసుకోలేదు. ఎందుకంటే మేము ఇద్దరం విదేశీ విధానాలకు విరుద్ధం. మ్యారేజ్ సర్టిఫికెట్ విదేశీ సంస్కృతికి నిదర్శనమని భావించి తీసుకోలేదు. అయితే పవిత్ర నా భార్య అని నిరూపించడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. నా పాస్ పోర్టు, ఆధార్ కార్డు గమనిస్తే ఆమె నా భార్యే అని ఉంటుంది. మేము ఇద్దరం కలిసి చాలా ఫంక్షన్స్ కూడా వెళ్ళాం” అంటూ చెప్పుకొచ్చారు.
సూచేంద్ర వ్యాఖ్యలతో మళ్ళీ ఈ వివాదం మొదటికి వచ్చింది. నిజానికి ఇలాంటి గొడవలు లేదా సమస్యలు నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలి. లేదా కోర్టులో న్యాయపరంగా వాద ప్రతివాదనలు జరిపి తమ నిజాయితీని నిరూపించుకోవాలి. ఇలా రోడ్డుకెక్కి రచ్చ చేసుకుంటే ఆయా వ్యక్తుల గౌరవానికి భంగం కలగడం తప్ప ఏ లాభం లేదు.