కరోనా తర్వాత బాలీవుడ్ సినిమాలకు కష్టకాలం మొదలయింది. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఇక బాలీవుడ్ పని అయిపోయిందని, త్వరలోనే దక్షిణాది సినిమాలు హిందీ స్థానాన్ని ఆక్రమిస్తాయని అందరూ భావించారు.
కానీ ఈ అపనమ్మకం తొలగించడానికి ఒక భారీ సినిమా రావడానికి ఎంతో కాలం పట్టలేదు. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ బాలీవుడ్ కు అత్యవసరమైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పఠాన్ మళ్లీ హిందీ మార్కెట్ సామర్థ్యాన్ని తిరిగి తీసుకువచ్చింది. దక్షిణాది సినిమాల కంటే హిందీ సినిమాల మార్కెట్ ఇప్పటికీ పెద్దదని ఈ చిత్రం తన ఆధిపత్యంతో, భారీ కలెక్షన్లతో నిరూపించింది.
ఉదాహరణకు ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విడుదలై 15 రోజుల్లో దాదాపు 200 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, అదే సీజన్ లో విడుదల అయిన తమిళ సినిమా వారిసు కూడా ఇప్పటి వరకు దాదాపు 270 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
కానీ పఠాన్ కేవలం 3 రోజుల్లోనే 310 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది అంటే 2 రోజుల్లో వాల్తేరు వీరయ్య, 3 రోజుల్లో వారిసు కలెక్షన్లను దాటేసింది. ఆ రకంగా తెలుగు, తమిళ సినిమాల కంటే హిందీ మార్కెట్ పెద్దది అని మరోసారి నిరూపించింది.
2023 గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు బుధవారం పఠాన్ హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ సమర్పణలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో పఠాన్ సినిమా రూపొందింది. అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ తో ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డులు బద్దలు కొట్టింది.
పఠాన్ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ జనవరి 20న ప్రారంభమయ్యాయి. కాగా ఈ సినిమా టికెట్ల కోసం సాగిన డిమాండ్ల కారణంగా, భారతదేశంలోని చాలా ప్రాంతాల్లోని థియేటర్ల యజమానులు ఈ సినిమాను ఉదయాన్నే ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు.