షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తుంది. బెస్ట్ డే 1 ఫిగర్ మరియు అసాధారణమైన ఓపెనింగ్ వీకెండ్ మరియు తరువాత సాధారణ వారం రోజుల్లో కూడా మంచి వసూళ్లను నమోదు చేసిన పఠాన్ ఇప్పుడు చాలా మంది ఊహించని విధంగా ప్రదర్శింపబడుతుంది.
కాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు భారతదేశంలో రూ .400 కోట్ల నెట్ క్లబ్ లో చేరిన మొదటి బాలీవుడ్ చిత్రంగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఇంతకు ముందు బాలీవుడ్ సినిమాల్లో భారత దేశంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన దంగల్ ను దాటేసి అనూహ్యంగా రెండు వారాల్లోపే ఈ ఘనతను పఠాన్ సినిమా సాధించింది.
టాలీవుడ్ నుండి బాహుబలి 2, శాండల్ వుడ్ నుండి కెజిఎఫ్ 2 ఈ మార్కును సాధించాయి మరియు మొత్తం మీద పఠాన్ ఇప్పుడు టాప్ 3 స్థానంలో నిలిచింది. మరో 3-4 రోజుల్లో కేజీఎఫ్ 2 నెట్ ను కూడా క్రాస్ చేసి ఆ పై బాహుబలి 2ను ఫుల్ రన్ లో వెంబడించి జాబితాలో రెండో స్థానంలో నిలుస్తుంది.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్ లో చేరే అంచున ఉంది. పఠాన్ 2023 గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు అంటే జనవరి 25 న హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో విడుదలైంది. దీపికా పదుకొనె, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మించింది. విడుదలకు ముందే అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తోంది.
ఈ బ్లాక్ బస్టర్ తో షారుఖ్ ఖాన్ మళ్లీ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులని థియేటర్లకు రప్పించి బాలీవుడ్ డల్ స్టేజ్ కు ముగింపు పలికారని చెప్పక తప్పదు.