పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత వారంలో జ్వరం, అస్వస్థతకు గురికావడంతో షూటింగ్స్ నుంచి విరామం తీసుకున్నారు. కాగా ఇప్పుడు ఆయన కోలుకుని వచ్చే వారంలోనే ‘ప్రాజెక్ట్ కె’ షెడ్యూల్ లో జాయిన్ అవుతారని తాజా సమాచారం.
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలకు అహర్నిశలు శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఆదిపురుష్, సాలార్, ప్రాజెక్ట్ కే ఇలా ఒకేసారి అన్ని సినిమాలకు సరైన విశ్రాంతి లేకుండా బాగా హడావుడిగా పని చేయడం వల్ల జ్వరం బారిన పడ్డారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ప్రభాస్ ఆస్పత్రికి వెళ్లారని, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని సమాచారం. వారి సలహాను పాటించిన ప్రభాస్ కొన్నాళ్ల పాటు తన సినిమా షూటింగులన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు.
ప్రభాస్ చివరగా రాధేశ్యామ్ సినిమాలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ప్రభాస్ తో పాటు ఆయన అభిమానులు కూడా సాలార్, ఆదిపురుష్ సినిమాల పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే కూడా రెండు భాగాలుగా తెరకెక్కనున్న భారీ చిత్రం.
మొదటి భాగం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నాగ్ అశ్విన్, అశ్వనీదత్ లు ప్రభాస్ ప్రాజెక్ట్ కే గురించి తమ స్టేట్ మెంట్స్ తో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్ట్ గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. వెండితెర పై ఒక భారీ చిత్రాన్ని చూపించడానికి ఇది పూర్తిగా కొత్త ప్రయత్నమని అన్నారు. ఈ చిత్రంలో దీపికతో పాటు అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రభాస్, కృతి సనన్ ల నిశ్చితార్థం మాల్దీవుల్లో జరుగుతోందంటూ కొన్ని పుకార్లు షికారు చేశాయి. అయితే ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు.