ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ వీఎఫ్ఎక్స్ పనులను మెరుగుపరిచేందుకు ఈ సినిమా విడుదల తేదీని జూన్ నెలకు వాయిదా వేశారు. కాగా ఈ బాహుబలి స్టార్ ప్రస్తుతం నటిస్తున్న మరో భారీ సినిమా ప్రాజెక్ట్ కే.. కాగా ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతి సీజన్లో విడుదల చేయనున్నట్లు గతంలోనే నిర్మాతలు ప్రకటించారు.
అయితే ఇండస్ట్రీ నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ప్రాజెక్ట్ కే సంక్రాంతికి రాదని, బాలీవుడ్ మరియు పాన్ ఇండియా సినిమాలకు బాగుంటుందని అందరూ భావించే రిపబ్లిక్ డే వీకెండ్ లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ఈ వార్త నిజమైతే గనక చాలా పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల రీషెడ్యూల్స్ చాలానే ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే సంక్రాంతి పండగ సీజన్ లో తమ సినిమాలను విడుదల చేయాలని చాలా మంది నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ప్రాజెక్ట్ కే 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది, ఇది అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేక వాహనాలను డిజైన్ చేయమని గతంలో నాగ్ అశ్విన్ మహీంద్రాను కోరారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిత్ర నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ ఇది గ్రాఫిక్స్ చాలా ఎక్కువ ప్రాధాన్యత కలిగిన చిత్రం అన్నారు. కాగా గ్రాఫిక్స్ వర్క్ స్టార్ట్ చేసి ఐదు నెలలవుతోంది అని.. ఈ ఏడాది పొడవునా షూటింగ్ కొనసాగుతుంది అని చెప్తూ, ఇప్పటి వరకూ 70 శాతం చిత్రీకరణ పూర్తయ్యిందని అన్నారు.
ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.