నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలై నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా నాని నుంచి కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమా కోరుకున్న ప్రేక్షకులకి సుందరం అందించిన ఆరోగ్యకరమైన హాస్యం నచ్చినా, ఎందుకో అసలు నాని సినిమా అంటే రావాల్సిన స్థాయిలో థియేటర్ల వద్ద ప్రేక్షకుల కనిపించలేదు. సినిమా బాగానే ఉంది కానీ రకరకాల కారణాల వల్ల ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఈ సినిమాకి చాలా చోట్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినా నిర్మాతలు మాత్రం పెద్దగా ప్రమాదంలో పడకుండా బయట పడ్డారు అని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ రకంగా నిర్మాతలకు మంచి లాభసాటి వ్యాపారం జరిగినట్లుగా తెలుస్తోంది.ఇక గత ఆదివారం అంటే జూలై 10న అంటే సుందరానికీ తెలుగుతో పాటు తమిళం,మలయాళం భాషల్లో నెట్ఫ్లిక్స్ లో విడుదల అయింది. థియేటర్లలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఓటీటీలో మాత్రం ఖచ్చితంగా మంచి ఆదరణ పొందుతుంది అని ఇండస్ట్రీ వర్గాలు, సినీ విశ్లేషకులు అంచనా వేశారు.
వారి అంచనా నిజం అయింది అనే చెప్పాలి. ఊహించినట్లుగానే ఓటీటీలో సుందరం హవా బాగా నడుస్తోంది. నెట్ఫ్లిక్స్ లో మూడు రోజుల క్రితం విడుదలైన అంటే సుందరానికీ సినిమా.. తెలుగు వెర్షన్ లో మొదటి స్థానంలో, తమిళ వెర్షన్ లో ఆరో స్థానంలో ట్రెండ్ అవుతుందిట. ఈ వార్త ఖచ్చితంగా నానికి మరియు చిత్ర బృందానికి ఆనందాన్ని కలిగిస్తుంది అనే చెప్పాలి. ఇక నాని తన తదుపరి చిత్రం “దసరా” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి శ్రీకాంత్ ఓడెల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించడం విశేషం.