అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు విజయ్ దేవరకొండ. అంతకు ముందు, అతను కొన్ని మంచి పాత్రలు చేసినా, అర్జున్ రెడ్డి సినిమా ఈ నటుడికి స్టార్ స్టేటస్ తెచ్చి పెట్టింది. అయితే, లైగర్ అనే ఓకే ఒక్క సినిమా ఈ స్టార్ హీరోని అమాంతం కిందకు లాగేసింది.
ఈ ఎమర్జింగ్ స్టార్ నుండి భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కాగా ఈ చిత్ర ఫలితం తాలూకు పరిణామాలు ఇప్పటికీ విజయ్ దేవరకొండను బాధపెడుతున్నాయి. బహుశా విజయ్ తదుపరి చిత్రంతో ఆయన ఒక భారీ హిట్ స్కోర్ చేసే వరకూ లైగర్ ఫలితం ఆయన పై ప్రభావాలను చూపుతూనే ఉంటుంది.
ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రచారం చేయబడింది మరియు విజయ్ దేవరకొండ సినిమా గురించి విడుదలకి ముందు చాలా ఖచ్చితమైన, భారీ ప్రకటనలు కూడా చేశారు. పూరీ జగన్నాథ్ తో కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సీక్వెల్ చేయమని కూడా అడిగారు. అంతే కాకుండా పూరీ కాంబినేషన్లో జనగణమన అనే కొత్త సినిమా కూడా ప్రారంభించారు.
అయితే లైగర్ సినిమ భారీ పరాజయం వల్ల విజయ్ ప్రపంచమే తలకిందులైంది. అంతే కాకుండా, సినిమాలోని పెట్టుబడులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుండి విజయ్ ఎన్నో ప్రశ్నలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇది నిజంగా విజయ్ కు దారుణ పరిస్థితి అనే చెప్పాలి.
విజయ్ ఎంతో కష్టపడి తన విలువైన సమయంతో పాటు శక్తి, ప్రయత్నాలను లైగర్ కోసం పెట్టుబడి పెట్టారు, కానీ ప్రతిఫలంగా, ఒక హీరోగా తన ప్రతిష్టను కోల్పోయారు, అతని ఇమేజ్ పూర్తిగా దెబ్బతీనడమే కాకుండా ఇప్పుడప్పుడే పరిస్థితులు చక్కబడేలా కనిపించటం లేదు.
విజయ్ దేవరకొండ ఉన్న పరిస్తితిలో ఒక్కసారి మనల్ని ఊహించుకుంటేనే భయపడాల్సి వస్తుంది. పరిశ్రమలోని సన్నిహితుల అభిప్రాయం ప్రకారం అతనికి ఎంతో దృడ సంకల్పం ఉందని తెలిసింది. జీవితం పట్ల విజయ్ దేవరకొండ వైఖరి మరియు దృఢత్వం ఎంతో స్ఫూర్తిదాయకం.
ఆ స్ఫూర్తి మరియు పోరాట పటిమ సహాయంతో తను తిరిగి మళ్ళీ స్టార్ హీరోగా ఉద్భవించి, అతను అర్హత కలిగిన స్థానానికి చేరుకుంటారని కోరుకుందాం.