శర్వానంద్ నటించిన తాజా చిత్రం ఒకే ఒక జీవితం సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. విడుదలకు ముందు ఈ సినిమాకి సరైన క్రేజ్ లేకపోవటం వలన మొదటి-రోజు ఓపెనింగ్స్ సాధారణంగా ఉన్నప్పటికీ, మౌత్ టాక్ చాలా బాగుండటం వల్ల తర్వాతి రోజుల్లో ఈ చిత్రం జోరును పెంచి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి నంబర్లను నమోదు చేసుకుంది. తద్వారా ఈ చిత్రం విజయవంతమైన సినిమాగా నిలిచింది.
ఈ చిత్రానికి చాలా మంచి రివ్యూలు వచ్చినప్పటికీ, ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం OTTలో వచ్చే వరకు వేచి ఉండటానికే మొగ్గు చూపారు. అయితే ఎట్టకేలకు ఈ వర్గం ప్రేక్షకులకు ఒక శుభవార్త వచ్చింది. ఒకే ఒక జీవితం అక్టోబర్ రెండవ వారం నుండి Sony Liv OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయబడుతుందని సమాచారం.
అంతే కాకుండా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. Sony Liv ఓకే ఒక జీవితం సినిమా తాలూకు OTT హక్కులను 15 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. Sony Liv సంస్థ ఇటీవలే వరుసగా తెలుగు సినిమాల OTT హక్కులను సొంతం చేసుకుంటూ వస్తుంది. ఫ్3, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలను కొన్న తర్వాత ఇప్పుడు ఓకే ఒక జీవితం సినిమా హక్కులను చేజిక్కించుకుంది.
ఇక 15 కోట్ల మొత్తం అనేది శర్వానంద్ వంటి హీరో నటించిన మీడియం రేంజ్ సినిమాకి ఇది చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పాలి. కాగా ఇటీవలి కాలంలో సరైన హిట్ లేని శర్వానంద్ కు ఈ సినిమా ఫలితం ఎంతో ఉపశమనం ఇవ్వటమే కాకుండా ఇప్పుడు ఈ OTT ఆఫర్ మరో రకంగా లాభం చేకూర్చింది.
ఒకే ఒక జీవితం సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో అమల అక్కినేని నటించగా, వెన్నెల కిషోర్, ప్రియదర్శి పులికొండ, రీతూ వర్మ మరియు నాజర్ కూడా ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి రచయితతో పాటు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. కాగా ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.