బాలీవుడ్ భారీ నిర్మాణ యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న YRF స్పై యూనివర్స్ కాస్టింగ్ పరంగా భారతదేశం అంతటా విస్తరించడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్ ఈ యూనివర్స్ లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి ఆయన నటించనున్నారట. ఈ వార్త ఎన్టీఆర్ అభిమానులకు తీపి కబురు అందించింది. అలాగే తెలుగు సినీ ప్రేమికులు కూడా ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ ఫ్రాంచైజీలో ఎన్టీఆర్ నటించడం అనే వార్త విని థ్రిల్ అవుతున్నారు.
కాగా 2019 లో విడుదలైన యాక్షన్ ఎంటర్ టైనర్ వార్ కు సీక్వెల్ తీయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా ఇప్పుడు సౌత్ మార్కెట్ లోకి అడుగుపెట్టి ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ ను జోడించడానికి ఇక్కడి చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖ తారల పేర్లను జోడించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కాగా ఎన్టీఆర్ తో చిత్ర బృందం చర్చలు చివరి దశలో ఉన్నాయని, ఈ సినిమాలో నటించేందుకు ఎన్టీఆర్ అంగీకరించనున్నారని సమాచారం. అయితే ఆయన పాత్రకు సంబంధించిన వివరాలు మాత్రం ప్రస్తుతం గోప్యంగా ఉంచారు. అయాన్ ముఖర్జీ వార్ 2 కు దర్శకత్వం వహిస్తుండగా, బాలీవుడ్ బడా నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇక YRF ఫ్రాంచైజీ విషయానికి వస్తే, తాజాగా ఈ లిస్ట్ లో షారుఖ్ ఖాన్ యొక్క పఠాన్ సినిమా చేరింది. ఇక ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాలకు కొనసాగింపుగా రానున్న టైగర్ 3 కోసం కూడా ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా కనిపిస్తారు. టైగర్ 3 ముగిసిన చోట నుంచే వార్ 2 ప్రారంభం కానుంది.