NBK 108 లో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారనే వార్త చాలా రోజులుగా చక్కర్లు కొడుతున్న సంగతి అందరికి తెలిసిందే. కాగా తాజాగా ఈ వార్తను నటి స్వయంగా ధృవీకరించారు. వీరసింహారెడ్డి తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. NBK108 అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా అధికారికంగా టైటిల్ ఖరారు కాలేదు.
గత ఏడాది ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయగా, నటీనటులు, ఇతర టెక్నికల్ అంశాలకు సంబంధించి ఈ సినిమాకు సంబంధించి కొన్ని అప్ డేట్స్ మాత్రమే వచ్చాయి. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రం ఒక యాక్షన్ కామెడీగా ఉంటుందని ప్రకటించారు. అదే సమయంలో ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నట్లు నిర్మాతలు అధికారిక ప్రకటన కూడా చేశారు.
ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి కాజల్ అగర్వాల్ బాలకృష్ణ నటిస్తున్న NBK 108 చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించారు. తను చేస్తున్న ఇతర ప్రాజెక్టులతో పాటు ఈ విషయాన్ని తెలిపారు. ఆమె తదుపరి చిత్రాలలో ఘోస్టీ, కమల్ హాసన్ తో నటిస్తున్న భారతీయుడు 2 మరియు హిందీ చిత్రం ఉనా ఉన్నాయి. తెలుగులో ఆమె నటిస్తున్న తాజా చిత్రం NBK 108 మాత్రమే.
బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించనున్నారు.