ఎట్టకేలకు ఎన్టీఆర్ 30వ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. దర్శకుడు కొరటాల శివ, కెమెరామెన్ రత్నవేలు మరియు ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రీ ప్రొడక్షన్ డిస్కషన్స్ చేస్తున్న ఒక ఫోటో ఇటీవలే ఇంటర్నెట్ లో హల్చల్ చేసింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో జరుగుతోందని, షూటింగ్ వచ్చే నెల లేదా జనవరి 2023లో ప్రారంభం కావచ్చని చిత్ర బృందం తెలిపింది.
నిజానికి ఎన్టీఆర్ తన సినిమా సెట్స్‌కి వెళ్లి చాలా రోజులైంది. RRR తర్వాత బహుశా తన కెరీర్లోనే కాదు జీవితంలోనే సుదీర్ఘమైన విరామం తీసుకున్నారు. కాగా ఎన్టీఆర్ 30 స్క్రిప్ట్‌ను తాజాగా పునరుద్ధరించమని దర్శకుడిని కోరారట. కొరటాల శివ నాలుగు విజయవంతమైన సినిమాల తర్వాత ఈ సంవత్సరం ఎవరూ ఊహించని రీతిలో ఆచార్య అనే డిజాస్టర్ అందించారు.
ఆచార్య బాక్సాఫీస్ వద్ద నమోదు చేసిన నిరాశాజనకమైన ఫలితం కొరటాల కెరీర్ సమీకరణాలను శాశ్వతంగా మార్చేసింది. దానికి తోడు ఆ చిత్రం తాలూకు ఆర్థిక లావాదేవిలలో కూడా ఆయన తలదూర్చడం.. అందువల్ల ఆయన తీవ్ర ఇబ్బందుల లోకి వెళ్ళడం వంటి రకారకాల పుకార్లు మరియు వార్తలు వచ్చాయి.
ఇక RRR తర్వాత ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారడం కూడా ఎన్టీఆర్ ఈ సినిమా స్క్రిప్ట్‌ని మళ్లీ రూపొందించడం తప్పనిసరి చేసింది. కొరటాల ఇంతకుముందే ఈ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాతో భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నట్లు చెప్పారు. కొరటాల ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ మరమ్మతులు భారీ స్థాయిలో జరుగుతాయని తెలుస్తోంది.
ఇక ఇటీవలి అప్‌డేట్ ప్రకారం ఎన్టీఆర్ 30 షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ త్వరగా పూర్తి చేసే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయని.. ఈ సినిమాని 2023 దసరా సీజన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ మరియు కొరటాల శివ ఇద్దరూ కూడా షూటింగ్ త్వరగా పూర్తి చేస్తారనే పేరు తెచ్చుకున్నారు. అందుకే యంగ్ టైగర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌గా ప్రసిద్ధి చెందారు.
ఇక ఎన్టీఆర్ 30 గూర్చి వచ్చిన ఈ తాజా అప్‌డేట్ ఎన్టీఆర్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే వారు ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన తమ చిత్రం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.
ఎన్టీఆర్ చివరిగా సోలో లీడ్ రోల్ పోషించిన చిత్రం 2018లో (అరవింద సమేత) విడుదలైంది. ఎన్టీఆర్30 షెడ్యూల్ ప్రకారం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్‌ను పూర్తి చేసి, అనుకున్న సమయానికి థియేటర్లలోకి రావాలని ఆశిద్దాం.