ఎన్టీఆర్ 30లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తుందని కొన్ని రోజులుగా అనేక రకాల పుకార్లు వచ్చాయి. అయితే అలాంటి పలు విధాలుగా రూమర్స్ వస్తున్నా చిత్ర యూనిట్ నుంచి కానీ, నటి నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రావడం జరగలేదు. అయితే నేడు జాహ్నవి కపూర్ 26వ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 చిత్ర నిర్మాతలు ఆమెను హీరోయిన్ గా అధికారికంగా ప్రకటించారు. అయితే ఆమె పోస్టర్ కు మాత్రం నిరాశపరిచే విధంగా స్పందన వచ్చింది.
ఎన్టీఆర్ కెరీర్ లోనే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ఎన్టీఆర్ 30 ఒకటి. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు పలుమార్లు వాయిదా పడటం అటు ఎన్టీఆర్ అభిమానులను, ఇటు ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది.
ఈ సినిమా అప్డేట్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక ఈ రోజు ఉదయం జాహ్నవి కపూర్ కథానాయికగా నటిస్తున్నట్లు ప్రకటిస్తూ నిర్మాతలు అధికారికంగా పోస్టర్ ను విడుదల చేయగా, విఎఫ్ఎక్స్ మరియు డిజైన్ బ్యాడ్ గా ఉండటంతో ఈ పోస్టర్ కు నిరాశాజనకమైన స్పందన వచ్చింది. పోస్టర్ కు వీఎఫ్ఎక్స్, అదనపు డిజైన్ జోడించడం అనవసరమని అభిమానులు, నెటిజన్లు భావించారు. ఎన్టీఆర్ 30 కోసం హీరోయిన్ అనౌన్స్ చేయడానికి చిత్ర యూనిట్ సింపుల్ పిక్ ను ఎంచుకుని ఉంటే బాగుండేది అని వారు భావించారు.
ఎన్టీఆర్ తో కలిసి నటించాలనే తన కోరికను జాహ్నవి పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ జోడీని తొలిసారి తెర పై చూడటం నిజంగా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఈ చిత్రం ద్వారా జాన్వీ దక్షిణాది చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టనున్నారు. ఇంతకు ముందు మరి కొన్ని తెలుగు సినిమాల్లో కూడా ఆమె పేరు వచ్చింది కానీ ఏదీ కన్ఫర్మ్ కాలేదు.
ఎన్టీఆర్ 30 చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ అధినేత హరికృష్ణ కె, యువసుధ ఆర్ట్స్ అధినేత సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఆర్.రత్నవేలు సినిమాటోగ్రఫీ, సాబు సిరిల్ ఆర్ట్ విభాగాలను చూసుకుంటున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.