RRR సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్.. దర్శకుడు కొరటాల శివతో ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 సినిమా పోయిన మే నెలలో లేదా జూన్‌లోనే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది కానీ ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. ఆచార్య సినిమా అనూహ్యంగా భారీ డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చినప్పటి నుండి, కొరటాల శివకు పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేవనే చెప్పాలి.
ఆచార్య సినిమా కొనుగొలుదార్లకు భారీగా నష్టాలు రావడంతో.. కొరటాల కొద్ది రోజుల వరకు ఆ నష్టాల పూడ్చే పనిలో పడ్డారు. అయితే ఈ వ్యవహారం అంతా చక్కదిద్దేందుకు కాస్త సమయం పడుతుంది అని వార్తల నేపథ్యంలో ఆచార్య చిక్కుల్లోంచి కొరటాల శివ పూర్తిగా బయటపడ్డాకే తన సినిమా మొదలు అవుతుందని ఎన్టీఆర్ స్పష్టం చేశారట. ఇక కొరటాల ఆచార్య నష్టాల వ్యవహారం నుంచి మొత్తంగా బయట పడ్డ తర్వాత, ఆయన తన పూర్తి దృష్టిని ఎన్టీఆర్ చిత్రం వైపు మళ్లించారు.
అదే క్రమంలో స్క్రిప్ట్ వర్క్ కు సంభందించిన పనులను ప్రారంభించారు.అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ స్క్రిప్ట్‌లో పలు మార్లు మార్పులు చేర్పులు చేయమని కోరారు. అయన సూచనల మేరకు కొరటాల తన స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేసినప్పటికీ, ఎన్టీఆర్ ఇప్పటికీ స్క్రిప్ట్‌ను ఓకే చేయలేదని తెలుస్తోంది. దీంతో అసలు ఈ సినిమాపై ఎన్టీఆర్ ఆసక్తి చూపుతున్నారా లేదా అని నిర్మాతలు ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి ఆందోళన చెందుతున్నారట.
ఈ నేపథ్యంలో కొరటాల శివతో కలిసి నటించేందుకు ఎన్టీఆర్ ఆసక్తి చూపడం లేదనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఇప్పుడు వేరే దర్శకుల కోసం వెతికే ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రస్తుతానికి ఎవరూ ఖాళీగా లేరు. ఒక్కో డైరెక్టర్ ఒక్కో హీరోతో సినిమాలకు కమిట్ అయి ఉన్నారు. అందువల్లే ఎన్టీఆర్ ఇంకా కొరటాల సినిమాని పూర్తిగా రద్దు చేయలేదు.
ఇదివరకే చెప్పుకున్నట్లు ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ చాలా జాగర్తలు తీసుకుంటున్నారు. అందుకే ఒకటికి రెండుసార్లు దర్శకుడు కొరటాల శివకు మార్పులు చేయమని సూచించారు. మరి కొరటాల శివ నుంచి వచ్చే ఫైనల్ నేరేషన్ అయినా ఎన్టీఆర్‌ని ఒప్పించగలదో లేదో వేచి చూడాలి.