తాజా వార్తలను విశ్వసిస్తే ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’లో మరో భాషా పెద్ద సూపర్ స్టార్ హీరో ప్రతినాయకుడిగా నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.
గత ఏడాది స్టార్ హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ ను లాంఛనంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కొరటాల శివ క్లోజ్ ఫ్రెండ్ సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా మారుతున్నారు. ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కొరటాల శివ ఈ సినిమాను భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. కాగా మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదని అంటున్నారు. ఈ సినిమాకు స్కేల్, వీఎఫ్ఎక్స్ భారీ స్థాయిలో ఉండనున్నాయి. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఇతర భాషల నుంచి టాప్ హీరో కోసం యూనిట్ అన్వేషిస్తోందని, ఈ సినిమాలో విలన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని కూడా అంటున్నారు.
ఇతర భాషల నుంచి పాపులర్ హీరో కోసం చిత్రబృందం వెతుకుతోంది. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రం యొక్క బిజినెస్ కు, ఇతర భాషల్లో ఉన్న క్రేజ్ కు కూడా ఇది ఎంతగానో సహాయ పడుతుంది.
ఇటీవల తన సోదరుడు కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ మాట్లాడుతూ కొరటాల శివతో తన సినిమా ఈ నెలలోనే లాంఛనంగా ప్రారంభమై మార్చి 20 లోగా సెట్స్ పైకి వెళ్తుందని వెల్లడించాడు. ఇప్పటికే నిర్మాతలు ప్రకటించినట్లుగా ఎన్టీఆర్ 30 సినిమాను 2024 ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు.
కాగా ఈ సినిమాలోని విలన్ పాత్ర కోసం చియాన్ విక్రమ్, తమిళంలో విజయ్ సేతుపతి, బాలీవుడ్ నుంచి సైఫ్ అలీఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది. జనవరి 1న విడుదలైన రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఎన్టీఆర్ ముఖాన్ని రివీల్ చేయకపోయినా ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ తో అందరినీ ఆకట్టుకుంది.” ధైర్యం ఒక వ్యాధిగా మారినప్పుడు, భయం ఒక్కటే నివారణ”, అనేది ఈ సినిమా యొక్క ట్యాగ్ లైన్.
ఎన్టీఆర్ 30లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు కొరటాల శివ, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఇప్పటికే లొకేషన్ల అన్వేషణలో ఉన్నారు.
ఈ సినిమాలో వాటర్ బ్యాక్ డ్రాప్ తో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని సమాచారం. ప్రస్తుతం దక్షిణ భారత సినీ పరిశ్రమలో రాక్ స్టార్ గా విశేష స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకున్న అనిరుధ్ రవిచందర్ ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సంగీతం అందించనున్నారు.