తెలుగు సినిమా పరిశ్రమలో నైజాం డిస్ట్రిబ్యూషన్ మార్కెట్ ను దిల్ రాజు, ఏషియన్ గ్రూప్ ఏళ్ల తరబడి నిర్వహిస్తున్నాయి. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ క్లబ్ లో చేరి కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలు పెట్టింది. పై వారంతా బడా నిర్మాతలే అయినప్పటికీ ఈ మధ్య కాలంలో ఈ ఫీల్డ్ లో పుట్టుకొచ్చిన పేరు వరంగల్ శ్రీను.
మాస్ మహరాజ్ రవితేజ నటించిన క్రాక్ వంటి సూపర్ సక్సెస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ డిస్ట్రిబ్యూటర్ ఒక దశలో దిల్ రాజు ఆధిపత్యానికి సవాలు విసిరారు. ఆ పైన పలువురు టాలీవుడ్ ప్రముఖ హీరోల సినిమాల హక్కులను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. వరంగల్ శ్రీను, దిల్ రాజు మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఆ తర్వాత ఈ డిస్ట్రిబ్యూటర్ కు ఆచార్య, లైగర్ రూపంలో భారీ ఎదురుదెబ్బలు తగిలాయి.
టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఆచార్య. ప్రధాన ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లిందని, అన్ని పార్టీలకు 50 శాతం నష్టం వాటిల్లిందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేశారు. అదే విధంగా లైగర్ కూడా వ్యాపారంలో భాగం అయిన అన్ని పార్టీలకు కూడా ఎవరూ ఊహించని రీతిలో భారీ నష్టాలను తెచ్చి పెట్టింది.
ఈ నష్టాల తాకిడికి వరంగల్ శ్రీను ఏకంగా ఈ ఫీల్డ్ నే వదిలేశారని సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి ఆయన సినిమాలేవీ కొనడం లేదని, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు తెలుస్తోంది.