నివేతా థామస్, రెజీనా కసాండ్రా నటించిన శాకిని డాకిని చిత్రం ఈ నెల ప్రారంభంలో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ఆకట్టుకునే ప్రచార కార్యక్రమాలను జరిపినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రం పేలవమైన సమీక్షలతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా చప్పని స్పందనను తెచ్చుకుంది. తద్వారా బాక్సాఫీస్ వద్ద పరాజయం చవి చూసింది. ఈ సినిమా తెరకెక్కించే విధానంలో దర్శకుడికి, నిర్మాతలకి మధ్య విభేదాలు వచ్చినట్టు పుకార్లు వచ్చాయి.
కాగా శాకిని డాకిని ఇప్పుడు OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఆ రకంగా ఈ చిత్రం కూడా ఓటిటి విడుదలకు సంబంధించిన కొత్త నిభందనలకు విరుద్ధంగా రెండు వారాలకు ఓటిటిలో విడుదల కావడం గమనార్హం. ఈ చిత్రం కొరియన్ సినిమా మిడ్‌నైట్ రన్నర్స్‌కి రీమేక్ గా తెరకెక్కింది.
‘ఓ బేబీ’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్‌వూ థామస్ కిమ్ నిర్మాతలుగా వ్యవహరించారు. విలక్షణమైన కథలతో సినిమాలు తీస్తారని పేరు తెచ్చుకున్న సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
శాకిని డాకిని సినిమాలో నివేదా థామస్ మరియు రెజీనా కసాండ్రా ఇద్దరూ పోలీస్ ట్రైనీలుగా నటించారు. మొదట ఒకరిని ఒకరు తిట్టుకోవడం, పొట్లాడడం ఆ తర్వాత స్నేహితులుగా మారిన తర్వాత.. అనుకోని పరిస్థితుల్లో ఒక క్రైమ్ సిండికేట్ తో తలపడడం వంటి అంశాలతో ఈ సినిమా రూపొందించబడింది.
కథ బాగున్నా, కొంతవరకు కామెడీ సన్నివేశాలు కూడా పండినా.. ఇన్వెస్టిగేషన్ కు సంభందించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. కాకపోతే ఈ రెజీనా, నివేదాల నటన, యాక్షన్ సన్నివేశాలలో వారు పడ్డ కష్టానికి మాత్రం ప్రశంసలు దక్కాయి. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 30వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫారమ్ లో తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.