నివేదా పేతురాజ్, విశ్వక్ సేన్ జంటగా నటించిన దాస్ కా ధమ్కీ చిత్రం మార్చి 22న ఉగాది పర్వదినం సందర్భంగా విడుదల కానుండగా, ఈ యువ జంట సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. వెయిటర్ వేషంలో రెస్టారెంట్లలో ఆహారాన్ని వడ్డించడం, మల్టీప్లెక్స్ లో టిక్కెట్లు అమ్మడం వంటి అనేక ప్రత్యేకమైన ప్రచార వ్యూహాలను అమలు చేయాలని ఈ చిత్ర యూనిట్ నిర్ణయించింది.
ఈ సినిమా ప్రచారం సందర్భంగా నటి నివేదా పేతురాజ్ ఈ చిత్రం లో పని చేయడం పై తన అనుభవాలను పంచుకుంటూ ఈ చిత్ర దర్శకుడు విశ్వక్ సేన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. విశ్వక్ సేన్ టాలీవుడ్ లోకేష్ కనగరాజ్ కావచ్చని, ఆయనకు ఎన్నో అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయని అన్నారు. విశ్వక్ సేన్ దర్శకత్వ నైపుణ్యాలు, విజన్ ను పరిగణనలోకి తీసుకంటే ఆయనను నటుడిగా కంటే దర్శకుడిగానే చూడాలని ఉందని ఆమె అన్నారు.
బాలకృష్ణ, ఎన్టీఆర్ వంటి పెద్ద మాస్ హీరోలను డైరెక్ట్ చేసే సత్తా విశ్వక్ కు ఉందని చెప్తూ.. గ్యాంగ్ స్టర్ సినిమాలంటే ఆయనకు పిచ్చి అని, వాటికి గనక ఆయన దర్శకత్వం వహించారంటర్ తప్పకుండా సంచలనం సృష్టించగలరని నివేదా పేతురాజ్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఉగాది రోజు విడుదలవ్వబోతున్నందున హాలిడే అడ్వాంటేజ్ ను ఉపయోగించుకుని దాస్ కా ధమ్కీ సైనా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రావు రమేష్, అక్షర గౌడ, తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.