యువ హీరో నితిన్ తాజాగా నటించిన మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రం పై ప్రేక్షకుల్లో చక్కని ఆసక్తి ఏర్పడింది. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్ అవగా.. ‘మాచర్ల యాక్షన్ ధమ్కీ’ అంటూ వదిలిన వీడియోతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
నిన్న సాయంత్రం గుంటూరులోని బ్రోడీపేట్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ‘మాచర్ల నియోజకవర్గం’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి అభిమానులు భారీగా హాజరయ్యారు. గుంటూరులో ఘనంగా జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు అభిమానులు మరియు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరు కావడం విశేషం.
ఇక ఈ వేడుకలో చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో రారా రెడ్డి పాటలోని ‘రాను రాను అంటుంది చిన్నదోయ్’ పాపులర్ బిట్ కి నితిన్ తో పాటు కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, అనిల్ రావిపూడి స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం అభిమానులని అలరించింది. ఈ వేడుకలో నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి, సముద్రఖని, కాసర్ల శ్యామ్, జానీ మాస్టర్ తదితరలు పాల్గొన్నారు. ఇక ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ ఒక పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనిపించింది. నితిన్, కృతి శెట్టిల లవ్ ట్రాక్.. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మల కామెడీ మరియు ఫ్యామిలీ ఎలిమెంట్స్, కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి గా నితిన్ మాస్ క్యారక్టర్ అన్నీ కలగలిపి ప్రేక్షకులని థియేటర్ వైపు రప్పించేలా ఉన్నాయి.
మొదటి నుంచీ మాచర్ల నియోజకవర్గం సినిమాకు అన్ని ప్రచార కార్యక్రమాలు చక్కగా కుదరడమే కాకుండా ప్రేక్షకుల్లో సినిమా పై ఆసక్తిని కలగజేసాయి. రారా రెడ్డి మాస్ లోకి చొచ్చుకు పోయింది. ఇక చిన్న టీజర్ లా వచ్చిన మాస్ ధమ్కి తో పాటు నిన్న విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఒక కమర్షియల్ సూపర్ హిట్ సినిమాకు కావాల్సిన అన్ని వనరులూ దండిగా ఉన్నట్లు కనిపిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి.. హీరో నితిన్ తో పాటు తెలుగు సినీ చిత్రసీమను కూడా ఆనందింపజేస్తుంది అని ఆశిద్దాం.
ఈ సినిమాను రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రసాద్ మూరేళ్ల కెమెరా వర్క్ బాధ్యతను నిర్వర్తిస్తుండగా, మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.