తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన ఎస్ఎస్ ఆర్ శేఖర్.. ఇప్పుడు ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాటు. ఆయన దర్శకత్వంలో యువ హీరో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన “మాచర్ల నియోజకవర్గం” సినిమా రిలీజ్ కు రెడీ అయింది. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణంలో.. ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇటివలే దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పేరుతో కొన్ని పోస్టుల స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శేఖర్, ఇతర సామాజిక వర్గాలను కించపరుస్తూ అసభ్యకరమైన పదాలతో ట్వీట్లు చేయడం.. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం యొక్క కులానికి మద్దతుగా కామెంట్స్ చేసినట్లు వాటిల్లో కనిపించింది. దీంతో అతన వైఎస్ జగన్ అభిమాని అని, టీడీపీ మరియు ఇతర పార్టీలను ద్వేషించే వ్యక్తి అంటూ సోషల్ మీడియాలో ప్రేక్షకులు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే తన పేరుతో చక్కర్లు కొడుతున్న పోస్టులు ఫేక్ అకౌంట్ కు చెందినవి అని వాటిని ఎవరూ నమ్మవద్దని దర్శకుడు రాజశేఖర్ రెడ్డి వివరణ ఇచ్చారు. అవన్నీ ఫేక్.. ఎవరో కావాలని ట్వీట్లని ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. స్క్రీన్ షాట్ లో వున్న పేరు.. నా పేరుతో వున్న స్పెల్లింగ్ వేరు. ఫోటో షాప్ చేసిన వాడెవడో సరిగా చేయలేదు. నేను స్వతహాగా వైఎస్సార్ అభిమానిని. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు అభిప్రాయాన్ని చెప్పానే తప్ప.. వేరే ఏ కులాన్ని కించపరచలేదని, ఆ సమయంలో నేను చేసిన ట్వీట్ లని కూడా డిలీట్ చేయలేదని, ఇక మీదట కూడా చేయనని ఎస్ఆర్ శేఖర్ వివరణ ఇచ్చారు.
ఇదే పోస్ట్ పై హీరో నితిన్ స్పందిస్తూ ఈ విషయంలో దర్శకుడికి అండగా నిలిచారు. “ఒక నకిలీ వ్యక్తి చేసిన ఫేక్ ట్వీట్ అనవసరమైన వివాదం సృష్టించింది. దురదృష్టవశాత్తు ఇది మిగతావారి మనోభావాలను దెబ్బతీసింది. ఇది చాలా విచారకరం. అంతేకాదు ఈ పోస్ట్ అందరిని చాలా నిరాశపరిచింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను” అని నితిన్ పేర్కొన్నారు. ఆ ట్వీట్లు ఫేక్ అంటూ కొన్ని ట్వీట్స్ కూడా జత చేసారు.
ఇక ఈ విషయంలో దర్శకుడు తన పేరుతో ప్రచారంలో ఉన్న ట్వీట్లు అబద్ధం అని రుజువు చేసే లోపే. గతంలో ఎస్ఆర్ శేఖర్ ఏపీలో ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా చేసిన ట్వీట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యాయి. అయితే ఈ వివాదం మొత్తానికి దర్శకుడు రాజశేఖర్ రెడ్డి చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు ఆయన జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేశారు. తన పైన, తను చేస్తున్న సినిమా పైన ఒక ప్రణాళిక ప్రకారం ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారు అని, పరిస్తితి మరింత తీవ్రంగా మారక ముందే ఈ పని చేసిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేశారు రాజశేఖర్ రెడ్డి.
హీరో నితిన్ నటించిన చివరి రెండు చిత్రాలు ‘చెక్’ ‘రంగ్ దే’ ‘మ్యాస్ట్రో’ చిత్రాలతో ఆశించిన విజయాలను అందుకోలేక పోయాయి. ఈసారి ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలనే పట్టుదలతో నితిన్ ఉన్నారు. ఈ క్రమంలోనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు హోమ్ ప్రొడక్షన్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్టు 12న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.