చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం అందుకున్న తాజా చిత్రం ‘కార్తికేయ 2’. యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 13న తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో విడుదలైంది. రిలీజైన తొలి షో నుంచే ఈ సినిమా చక్కని స్పందన తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువైన నేపథ్యంలో తెలుగులోనే చిన్న సినిమా అయిన కార్తికేయ 2.. తొలి రోజు చాలా తక్కువ థియేటర్లలో విడుదలైనా.. క్రమక్రమంగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన టాక్ వల్ల థియేటర్ల సంఖ్య పెంచుకుని బాక్సాఫీసు వద్ద బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబట్టింది.
అంతే కాకుండా.. విడుదలై ఆరు వారాలు కావస్తున్నా ఇంకా థియేటర్లలో కార్తీకేయ 2 సందడి చేస్తుండటం విశేషం. 2014లో చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఇంతవరకూ నిఖిల్ కెరీర్ లో యాభై కోట్ల కలెక్ట్ చేసిన సినిమానే లేదు. కానీ కార్తీకేయ 2 చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్స్ సాధించింది. ఈ విజయం తర్వాత హీరో నిఖిల్ హిందీ మార్కెట్ పై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది.
ఇక బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ మధ్య ఏ సినిమా అయినా థియేట్రికల్ రిలీజ్ అనంతరం నెల రోజుల లోపే ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా నిర్మాతల గిల్డ్ ఓటిటి విడుదల విషయంలో కొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్లు చెప్పినా.. ఎవరూ ఆ నిభందనలు పాటించలేదు.
అయితే కార్తికేయ 2 విడుదలైన దాదాపు 2 నెలల తర్వాత అంటే ఎనిమిది వారాల నిబంధనను పాటిస్తూ త్వరలోనే ఓటీటీలో అందుబాటులో ఉండబోతుంది. కాగా కార్తికేయ 2 ZEE5 ప్లాట్‌ఫారమ్‌లో అక్టోబర్ 5వ తేదీ నుండి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో పాటు మలయాళంలో కూడా ప్రసారం కానుంది.
టి.జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించగా, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి, హర్ష సహాయక పాత్రల్లో కనిపించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఒక కీలక అతిథి పాత్రలో నటించారు. కాల భైరవ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.