Home సినిమా వార్తలు గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ఈ వారం సినిమాలు

గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ఈ వారం సినిమాలు

Telugu New Releases Misses A Golden Opportunity At The Box Office

ఈ ఆగస్టు నెల తెలుగు ప్రేక్షకులకి ఎన్నో రకాల అనుభూతులను పంచింది. బింబిసార, సీతా రామం, కార్తికేయ2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఎంతగానో అలరించాయి. అలాగే లైగర్ వంటి అనూహ్యమైన డిజాస్టర్ ను కూడా అందించింది. ఇలా ఆసక్తికరంగా సాగిన ఆగస్టు నెల తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చాలా లాభదాయకంగా ఉండింది. ఇక సెప్టెంబర్‌ కూడా అదే విధంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.

సెప్టెంబరు నెల తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒకేసారి రెండు సినిమాల విడుదలలతో ప్రారంభం కానుంది. వైష్ణవ్ తేజ్ నటించిన రంగ రంగ వైభవంగా మరియు అనుదీప్ కెవి రచనా బాధ్యత వహించిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు రెండూ థియేటర్లలో సెప్టెంబర్ రెండో తారీఖున విడుదల తేదీకి సిద్ధమవుతున్నాయి. రంగ రంగ వైభవంగా రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన సినిమా కాగా, ఫస్ట్ డే ఫస్ట్ షో అనుదీప్ తరహా చమత్కారమైన కామెడీతో రూపొందింది.

అయితే ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద తమకు ఎంతో లాభాన్ని అందించే ఒక సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాయి అని ట్రేడ్ వర్గాలు మరియు సినీ విశ్లేషకులు అంటున్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా అంటే నిన్న ఆగస్ట్ 31న ఈ రెండు సినిమాలూ విడుదలై ఉంటే హాలిడే అడ్వాంటేజ్ వల్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్ ను అద్భుతంగా రాబట్టేవి. సాధారణంగా వినాయక చవితి సందర్బంగా మ్యాట్నీ షోల నుండి ధియేటర్ ల వద్దకు ప్రేక్షకులు భారీగా తరలి వస్తారు.

నిన్న తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన కోబ్రా సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ సెలవు రోజు రిలీజ్ అవడం వల్ల అద్భుతమైన ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. అలాగే రంగ రంగ వైభవంగా, ఫస్ట్ డే ఫస్ట్ షో రెండు సినిమాలు కూడా నిన్ననే విడుదలై ఉంటే బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా భారీ వసూళ్లను సాధించేవి. ఆ రకంగా రెండు సినిమాలు ఒక సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నట్లే అని చెప్పవచ్చు.

అలాగని రేపు విడుదల అయినా పెద్ద నష్టం ఏమీ లేదనుకోండి. రంగ రంగ వైభవంగా మాస్ మరియు ఫ్యామిలీ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న సినిమా అవగా, ఫస్ట్ డే ఫస్ట్ షో యూత్ ప్రేక్షకులని ఆకట్టుకునే సినిమాగా తెరకెక్కింది. మరి ఈ రెండు చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version