సౌతిండియాలో ప్రస్తుతం బిజీ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ ఒకరు. 2022లో భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, గాడ్ ఫాదర్, ప్రిన్స్ వంటి చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. రాధేశ్యామ్ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన ఆయన గత ఏడాది చార్ట్ బస్టర్స్ సాంగ్స్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే వారిసు, వీరసింహారెడ్డి వంటి సినిమాలకు థమన్ సంగీతం అందించారు.
ఇలా తన కెరీర్ లో ఒక గొప్ప దశలో ఉండగా, ఒకదాని తర్వాత మరొక సినిమా చేస్తూనే, ముఖ్యంగా తన ప్రాజెక్టులు, హీరోల గురించి థమన్ చేసిన స్టేట్ మెంట్స్ సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి.
విజయ్ నటించిన వారిసు చిత్రానికి పని చేస్తున్నప్పుడు, దళపతి విజయ్ తో కలిసి పనిచేయడం తన చిరకాల కోరిక అని ఆయన వ్యక్తం చేశారు. బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి సినిమాల సమయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు మహేష్ బాబు SSMB28 సినిమాతో కూడా ఇదీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ప్రకటనలు చేస్తున్నారు.
ఇలా పని చేస్తున్న ప్రతి సినిమానీ డ్రీమ్ ప్రాజెక్ట్ అనడం, అలాగే ప్రతి సినిమాకు ఆ హీరోనే తన అభిమాన హీరో అని మాట మార్చడంతో థమన్ పై నెటిజన్లు రకరకాల ఎడిట్లతో ట్రోల్ చేస్తున్నారు. ఇక 2023 కూడా థమన్ కు చాలా పెద్ద సంవత్సరం అనే చెప్పాలి. ఇప్పటికే రామ్ చరణ్ – శంకర్ సినిమాకి పని చేస్తున్న ఆయన ఆయన తాజాగా పవన్ కళ్యాణ్ – సుజీత్ ఓజీకి కూడా కన్ఫర్మ్ అయ్యారు.