ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సీనియర్ నటుడు మరియు అనేక సంవత్సరాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రాముఖ్యత కలిగిన కృష్ణంరాజు గారు కేవలం కళాసేవ మాత్రమే కాకుండా అనేక స్వచ్ఛంద కార్యకలాపాలు మరియు సినీ కళాకారుల సంక్షేమంలో కూడా ఆయన ఎల్లప్పుడూ ముందంజలో ఉన్నారు. అలాంటి మహా మనిషి ఆకస్మిక మరణం నేపథ్యంలో.. అనుకోని విధంగా హీరో అల్లు అర్జున్ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.
అల్లు అర్జున్ SIIMA 2022 అవార్డులతో పుష్ప: ది రైజ్ చిత్రానికి గానూ తెలుగు ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. కాగా అవార్డును అందుకున్న ఆనందాన్ని ఆయన ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్ వేదికలలో పంచుకున్నారు.
అయితే అవే పోస్ట్ లు ఇప్పుడు అల్లు అర్జున్ కొంప ముంచాయి. సమయం సందర్భం లేకుండా ఆయన వేసిన అనాలోచిత పోస్ట్‌లు ఇప్పుడు వివాదానికి కారణం అయ్యాయి. ఒక పక్క తెలుగు సినిమా పరిశ్రమలో లెజెండరీ స్టేటస్ ఉన్న కృష్ణంరాజు గారు చనిపోతే ఆయన పట్ల కనీస గౌరవం లేకుండా అవార్డు గెలుచుకున్న సంతోషాన్ని తెలపడం నెటిజన్లకు ఏ మాత్రం మింగుడు పడలేదు. ఐకాన్ స్టార్ అని ఊరికే ట్యాగ్ పెట్టుకోవడం కాదు అందుకు తగ్గట్టు హుందాగా ప్రవర్తన కూడా ఉండాలని సోషల్ మీడియా యూజర్లు మండి పడుతున్నారు.
కాగా కృష్ణంరాజు హఠాన్మరణం యావత్ తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టింది, ఆయన మృతికి భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగు సినీ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఇక ఇండస్ట్రీ సీనియర్ పట్ల ఆ మాత్రం గౌరవం కూడా చూపకుండా అల్లు అర్జున్ ప్రవర్తన ఉందని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కృష్ణంరాజుని తన కెరీర్‌లో ఒక మార్గదర్శక శక్తిగా మరియు బలమైన ప్రభావం చూపిన వ్యక్తిగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో, అల్లు అర్జున్ ఇలా పోస్ట్‌లు పెట్టడం చాలా మందికి నచ్చలేదు.