మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కెరీర్లోనే బెస్ట్ ఫేజ్ లో ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ తరువాత శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న చరణ్, ఆ తరువాత గౌతమ్ తిన్ననూరి తో సినిమా సిద్ధంగా ఉంది.ఇదిలా ఉండగా ఆ తరువాత సుకుమార్ తో సినిమా కూడా ఉండచ్చు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కెరీర్ తొలి రోజులు మాస్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద హిట్స్ కు కొదవ లేకపోయినా, కాస్త డిఫరెంట్ గా ఉండటంతో పాటు భారీ సినిమాలు చేసినప్పుడే రామ్ చరణ్ కు ప్రశంసలతో పాటు ఆయా సినిమాలకు కాసుల వర్షం కూడా కురిసింది.
ఉదాహరణకు మగధీర,రంగస్థలం,ఆర్ ఆర్ ఆర్ ఈ మూడు సినిమాలు కూడా దిగ్గజ దర్శకులు అనదగ్గ వారితో పని చేసి, వారి దర్శకత్వ ప్రతిభ తో పాటు తన నటనా కౌశల్యం చూపించే అవకాశం ఆ సినిమాలలోనే అతడికి దక్కింది.
మగధీర టైం లో ఇంకా పాన్ ఇండియా రిలీజ్ ల సంస్కృతి లేకపోవటంతో ఆ సినిమా ఇతర భాషా ప్రేక్షకులకు అంతగా తెలియకుండా పోయింది. ఇక రంగస్థలం కూడా ఇతర భాషల్లో రిల్లీజ్ కాకపోయినా వైడ్ రిలీజ్ మరియు, సోషల్ మీడియా, ఓటిటీ ల వల్ల ఆ సినిమా కాస్త ప్రాచుర్యం పొందింది.
ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా సమయానికి పాన్ ఇండియా రిలీజ్ ల హవా బాగా ఉండటం, రాజమౌళి పేరు ప్రఖ్యాతలు నలువైపులా వ్యాపించి ఉండటంతో ప్రి రిలీజ్ పబ్లిసిటి యే కాకుండా సినిమా రిలీజ్ అయిన తరువాత ఆ సినిమాకు క్రేజ్ కు ఎలాంటి అవాంతరం లేకుండా పోయింది.
ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా ధియెట్రికల్ రిలీజ్ తరువాత దాదాపు పది వారాలకు ఓటిటీలో విడుదల అయింది. తెలుగు మరియు ఇతర దక్షిణ భాషల స్ట్రీమింగ్ జీ 5 కు దక్కగా, హిందీ వెర్షన్ మాత్రం నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. నెట్ఫ్లిక్స్ లో ఆర్ ఆర్ ఆర్ చూసిన అంతర్జాతీయ ప్రేక్షకులు కళ్ళు చెదిరే రాజమౌళి మాయాజాలానికి ఆశ్చర్య పోయారు.
ముఖ్యంగా రామరాజు గా రామ్ చరణ్ నటనకు ప్రశంసల జల్లులు కురిపించారు ప్రేక్షకులు. సాధారణ ప్రేక్షకుల నుండి సెలబ్రెటీల వరకూ రామరాజు కు ఫిదా అయిపోయారు. ప్రత్యేకించి రామరాజు ఇంట్రో ఫైట్ సీన్ ఒళ్ళు గగుర్పొడిచే విధంగా రెస్పాన్స్ వచ్చింది. ఈ హంగామా చూసిన నెటిజన్స్,మరియు అభిమానులు రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ గా పేర్కొనడం విశేషం.